చంద్రబాబు సామాన్యుడు కాదు: మోడీ ప్రభుత్వానికి కేఈ వార్నింగ్, కేసీఆర్ పిలిస్తే
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాన్యుడు కాదని, అనుకున్నది కచ్చితంగా సాధించి తీరుతాడని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము వేచి చూస్తున్నామని, తమ సహనాన్ని పరీక్షించవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్న కేంద్రం అవమానిస్తోంది కేవలం తెలుగుదేశం పార్టీని మాత్రమే కాదని, తెలుగు ప్రజలను అని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్రానికి ఏం ఇవ్వాలనుకున్నా ప్రధాని మోడీ ముందుగానే నిర్ణయం తీసుకోవాలన్నారు.

ప్రత్యేక హోదా ఇస్తారా.. ప్యాకేజీ ఇస్తారా చెప్పాలి
ఏపీకి ప్రత్యేక హోదానా లేక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలా అనే విషయాన్ని వెంటనే స్పష్టం చేసి, నిధులు విడుదల చేయాలని కేఈ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటులో ఆందోళన చేస్తున్న ఎంపీలను పిలిచి మోడీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

బీజేపీ వారిని పిలిచి మాట్లాడితే ప్రయోజనం ఏమిటి
బీజేపీ ప్రజాప్రతినిధులను పిలిచి నరేంద్ర మోడీ మాట్లాడితే ప్రయోజనం ఏమిటని కేఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు. కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెట్టిన గంట సమయంలోనే 46 పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. ఒకప్పటి రాజధాని అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ అయినా ఏర్పాటు చేయాలన్నారు.

కేసీఆర్ ఆహ్వానం పంపిస్తే ఆలోచిస్తాం
ఈ బెంచ్ ఏర్పాటుకు రాయలసీమలోని కర్నూలు సరైన ప్రాంతమని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. థర్డ్ ఫ్రంట్ విషయమై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆహ్వానం పంపిస్తే తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి దానిపై తమకు సమాచారం లేదని చెప్పారు.

నాలుగేళ్లలో టీడీపీ చేసిందేమీ లేదు
నాలుగేళ్లలో టీడీపీ చేసిందేమీ లేదని విశాఖ బీజేపీ నేత నాగేంద్ర వేరుగా అన్నారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన అభివృద్ధి కంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. విశాఖ అభివృద్ధికి బీజేపీ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అనేక సంస్థలను తీసుకు వచ్చిందన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు కూడా నిర్వహించలేకపోయారన్నారు.












Click it and Unblock the Notifications