శింగనమలలో శైలజానాధ్‌కే గెలిచే ఛాన్స్ - ఏం జరుగుతోంది..!!
ఏపీలో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. పోలింగ్ కు సమయం సమీపిస్తోంది. పార్టీల ప్రచార తీవ్రత పెంచాయి. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ వర్సస్ కూటమి అన్నట్లుగా పోటీ కనిపిస్తున్న వేళ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఈ సారి కీలకంగా మారుతోంది. పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తన అన్న జగన్ లక్ష్యంగా షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి శింగనమల నియోజకవర్గంలో కాంగ్రెస్ లెక్క మార్చేసింది. పోటీ ఉత్కంఠ పెంచుతోంది.
హోరా హోరీ పోరు
ప్రస్తుత ఎన్నికల్లో అనంతపురం జిల్లా అన్ని పార్టీలకు కీలకంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ రెండు స్థానాలకే పరిమితం అయింది. కూటమి - వైసీపీ మధ్య పోటీ కొనసాగుతోంది. అయితే, శింగనమలలో మాత్రం లెక్కలు వేరుగా కనిపిస్తున్నాయి. అక్కడ గెలుపు అంచనాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ మంత్రి శైలజానాథ్ కీలకంగా మారారు. 2014 రాష్ట్ర విభజన తరువాత వరుసగా జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం దక్కలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముఖ్య నేతలంతా ఓటమి పాలయ్యారు. అందులో మాజీ మంత్రి శైలజానాథ్ కూడా ఉన్నారు.

శైలజానాధ్ కొత్త వ్యూహం
శైలజానాథ్ మంత్రిగా ఉంటూనే సమైక్యవాదం వినిపించారు. రాష్ట్ర విభజన తరువాత పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు. తన సొంత నియోజకవర్గం శింగనమలలో శైలజానాథ్ చాలా కాలంగా పని చేసుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినా తిరస్కరించారు. అయితే, శింగనమలలో ఈ సారి టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కొత్త అభ్యర్థులను బరిలోకి దింపాయి. అదే సమయంలో నియోజకవర్గంలో చెప్పకొనే స్థాయిలో ఏ పని జరగలేదు. దీనిని తనకు అనుకూలంగా మలచుకోవటంలో శైలజానాథ్ ప్రయత్నాలు ఫలించాయి. నీటి సమస్యలు, రోడ్లు వేయకపోవటం, స్థానిక ప్రజల ఇబ్బందులను పరిష్కారం చేయకపోవటాన్ని శైలజానాథ్ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తనను గెలిపిస్తే శింగనమలకు పూర్వవైభవం తీసుకొస్తానంటూ ప్రచారంలో హామీ ఇస్తున్నారు.
కాంగ్రెస్ కు కలిసొచ్చేనా
పార్టీకి తొలి నుంచి మద్దతుగా నిలిచిన ఓట్ బ్యాంక్‌ను తిరిగి తన వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ,టీడీపీలో స్థానికంగా కొరవడిన సమన్వయం..ప్రచారంలో ఆ రెండు పార్టీల అభ్యర్థుల సమస్యలను శైలజానాథ్ తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. గతంలో రెండు సార్లు గెలిచి ఉండటంతో నియోజకవర్గం పైన పూర్తి పట్టు ఉంది. సర్వేల్లోనూ కాంగ్రెస్ కు శింగనమల అనుకూలంగా ఉందని విశ్లేషిస్తున్నాయి. అదే సమయంలో శింగనమలలోని ప్రతి తలుపును శైలజానాథ్ తడుతున్నాడు. అక్కడ స్థానిక నాయకులను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఇక సీనియర్ టీడీపీ, వైసీపీ నేతలతో కూడా టచ్‌లోకి రావడంతో వారు సహకరించేందుకు ముందుకొచ్చారు.దీంతో, ఈ సారి శింగనమల నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా అసెంబ్లీలో అడుగు పెడతారనే ప్రచారం సాగుతోంది. స్థానికంగా మారుతున్న సమీకరణాలతో శింగనమల ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications