ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రుల వేళ ఏపీ ప్రభుత్వ కీలకనిర్ణయం
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై జరుగు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో ఈసారి ఈ ఉత్సవాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో జరుగుతున్న ఈ వేడుకలపై తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు స్పెషల్ ఆఫీసర్
విజయవాడ కనకదుర్గ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలకు దేవాలయ శాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేడు ఆదేశాలు ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన చివరి నాలుగు రోజుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూసేందుకు, అన్ని విభాగాలను సమన్వయ పరచుకునేందుకు ఆయనని నియమించారు.

మూలా నక్షత్రం నాడు పోటెత్తనున్న భక్తులు
ఉత్సవాలను రాష్ట్ర పండుగ గా ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మూలా నక్షత్రం రోజైన అక్టోబర్ 9వ తేదీన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగేలా చూస్తామన్నారు.
దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన క్రమంలో కీలకనిర్ణయం
అమ్మవారి దర్శనం సులభంగా కలిగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్ర పండుగగా గుర్తించిన దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉందని, సీనియర్ అధికారులు ఉత్సవాల నిర్వహణలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు. భక్తులకు అమ్మవారి దర్శనం నభూతో న భవిష్యత్ అనిపించేట్లుగా పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు.
నేడు మహా చండీగా దర్శనమిచ్చిన అమ్మవారు
ఇదిలా ఉంటే దసరా శరన్నవరాత్రి వేడుకలు సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మవారు ఐదవ రోజు శ్రీ మహా చండీ దేవి అలంకారములో దర్శనమిచ్చారు.దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారిగా నేడు దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే అని చెప్తారు.












Click it and Unblock the Notifications