వారికి తలొగ్గొద్దు: ఈటెల, కిరణ్ సర్కస్ పులి: దూళిపాళ్ల
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిల ఒత్తిడికి లొంగవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ కోరారు. తెరాస, బిజెపి, సిపిఐ శాసన సభ్యులు సభాపతి నాదెండ్ల మనోహర్‌కు ఓ లేఖ రాశారు. రెండు రోజుల్లో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగించాలని కోరారు. చర్చ పేరుతో కాలయాపన సరికాదన్నారు.
ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. బిఎసి సమావేశం జరిగి రెండు రోజులు అయినా వివరాలు బయటపెట్టలేదన్నారు. కిరణ్, బాబు, జగన్‌ల ఒత్తిడికి తలొగ్గవద్దని కోరారు. గతంలో జరిగిన రాష్ట్రాల విభజనను పరిశీలించి, దానిని బట్టి నడుచుకోవాలని కోరారు.

టిటిడిపిపై హరీష్ మండిపాటు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల పైన తెరాస సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు ధ్వజమెత్తారు. టిటిడిపి నేతలు డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. సభను అడ్డుకుంటోంది సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు కాదా అని ప్రశ్నించారు. వారిని ఎందుకు కట్టడి చేయడం లేదన్నారు.
ముఖ్యమంత్రి సర్కస్‌లో పులి: దూళిపాళ్ల
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెసు పార్టీ అధిష్టానం సర్కస్‌లో పులిలా చూస్తోందని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నం చేస్తోందని అయితే, అమ్ముడు పోయే వారినే వారు కొనగల్గుతారన్నారు. కన్నతల్లికి ద్రోహం చేసే వారిని తరిమి కొట్టాలన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని సభలో రహస్య అజెండాగా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మండలి వాయిదా
మరోవైపు మండలిలో గందరగోళం చెలరేగడంతో చైర్మన్ వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications