ఆ ఇద్దరు ఉండుంటే... రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా ఉండేది
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రెండున్నర సంవత్సరాల గడువు ముగియగానే ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి మంత్రివర్గంలో కొందరిని మార్చారు. 5నెలలు గడిచిన తర్వాత సీఎం తీసుకున్న నిర్ణయం కానీ, అంచనాకానీ తప్పని నిరూపితమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రులుగా ఉన్నవారు ముఖ్యమంత్రికి రక్షణగా నిలబడాలి.. రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శలను వారికన్నా ధీటుగా తిప్పి కొడుతుండాలి. కానీ ఈ విషయంలోనే కొత్త మంత్రులు విఫలమవుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మంత్రులు చేసే విమర్శలకు ప్రాధాన్యమెక్కువ
ఇతర నేతలకన్నా మంత్రులు చేసే విమర్శలకు ప్రాధాన్యం ఉంటుంది. వారి వాయిస్ బలంగా వినపడుతుంది. కానీ ఇప్పుడున్న మంత్రులెవరూ జగన్‌పై, జగన్ కుటుంబ సభ్యులపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నదాడులను తిప్పకొట్టలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మొదటి మంత్రివర్గంలో ఉన్న కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ ముఖ్యమంత్రిపై ఈగ వాలనిచ్చేవారు కాదు. ప్రత్యర్థులు రెండు మాటలంటే.. వీరు నాలుగు మాటలనేవారు. మంత్రులుగా వీరి వాయిస్ కూడా మీడియాలో బలంగా వినిపించేది. వీరిద్దరూ పదవులు కోల్పోవడంతో 5 నెలల నుంచి వైసీపీ తరఫున బలంగా వాయిస్ వినిపించేవారే లేరనే అభిప్రాయం పార్టీల్లోనే కాకుండాప్రజల్లో కూడా వ్యక్తమవుతోంది.

ఇద్దరు నానీలకు ధీటైనవారు లేరు
కొడాలి నాని, పేర్ని నాని విమర్శలకు టీడీపీ నేతలు సరైన రీతిలో సమాధానం చెప్పలేకపోయేవారే. దాంతో వీరిద్దరిదే పైచేయిగా ఉండేది. పరస్పర విమర్శలు చేసుకున్నప్పుడు వీరిదే పైచేయిగా ఉండేది. దీంతో టీడీపీపై వైసీపీ మెరుగ్గా ఉందనే భావన కూడా ప్రజల్లో వ్యక్తమయ్యేది. సామాజికవర్గాల వారీగా న్యాయం చేయాలనే భావనతో కొత్త మంత్రులను ఎంపిక చేశారు. వీరికి పదవులు కట్టబెట్టి ఐదునెలలు దాటుతున్నప్పటికీ బలమైన గొంతుక వినిపించేవారే కరవయ్యారు. ఇటీవలి క్యాబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి జగన్ వారిని ఇదే విషయమై నిలదీసినట్లు తెలుస్తోంది.

పార్టీ కార్యకలాపాల్లో పాత మంత్రులు
పాత మంత్రులు దాదాపు మూడు సంవత్సరాల సమయం పదవుల్లో ఉన్నారు. నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ లాంటివారు కూడా మంత్రి పదవి కోల్పోయిన తర్వాత మౌనం వహించారు. పాత మంత్రులను జిల్లాలకు వైసీపీ ఇన్ ఛార్జిలుగా నియమించడంతో వారు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కొత్త మంత్రులు తమ శాఖలు, తమ నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. జగన్ పై, జగన్ కుటుంబ సభ్యులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. కొత్త మంత్రుల్లో రోజా, దాడిశెట్టి రాజా, జోగి రమేష్ మాత్రమే తమ వాయిస్ ను వినిపించగలుగుతున్నారు. బలమైన వాయిస్ వినిపించడానికి కొందరు మంత్రులను మారుస్తున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది.












Click it and Unblock the Notifications