కొడుకు కేసు: హైకోర్టుకు కోడెల కోడలు పద్మప్రియ
హైదరాబాద్: తన కుమారుడిని కోర్టు ముందు హాజరుపర్చేందుకు ఆదేశాలు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభాపతి కోడెల శివప్రసాద రావు కోడలు, కోడెల శివరామకృష్ణ సతీమణి కోడెల పద్మప్రియ బుధవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
నాలుగేళ్ల తన కుమారుడిని తన భర్త కోడెల శివరామకృష్ణ పలువురితో కలిసి కిడ్నాప్ చేశారని, తన బిడ్డను కోర్టు ముందు హాజరుపరిచేలా విశాఖపట్నం పోలీసులను ఆదేశించాలని ఆమె హైకోర్టును కోరారు. తన ఇంటిలోకి చొచ్చుకొచ్చి తీసుకు వెళ్లారని అందులో పేర్కొన్నారు.
తాను సెప్టెంబర్ 18వ తేదీన విశాఖ త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. తన కొడుకు కిడ్నాప్ విషయమై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

కాగా, ఇటీవల విశాఖలో పద్మప్రియ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కోడెల తనయుడు శివరామకృష్ణతో 2009 ఆగస్టు 6 తేదీన తనకు వివాహమైందని తెలిపారు. వివాహమైన కొద్దిరోజుల నుంచి తనను మామ, భర్త శివరామకృష్ణ, ఆడపడచు నిత్యం మానసికంగా వేధించేవారని పేర్కొంది. తను గర్భం దాల్చినప్పటికీ వేధింపులు తగ్గలేదన్నారు. ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
వేధింపులు భరించలేక తాను నాల్గవ నెలలో తన పుట్టింటికి వచ్చేశానని, కొంతకాలం తరువాత పెద్దల జోక్యంతో తన భర్త కాపురానికి తీసుకువెళ్లారని, ఆ తరువాత కూడా వేధింపులు తప్పలేదని ఆరోపించారు. వివాహ సమయంలో 10 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చామని, ఆ తర్వాత మరికొంత మొత్తాన్ని తీసుకురమ్మనమని వేధించేవారని, వేధింపులు భరించలేక, గత ఏడాది విశాఖలోని తన పుట్టింటికి వచ్చేశానని చెప్పారు.
ఈ నెల 17న రాత్రి 10 గంటల సమయంలో తన భర్తతో, మరికొంతమంది తన ఇంటి తలుపులు బద్దలుకొట్టి తనను, తన తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టి, నాలుగేళ్ల వయస్సున్న తన కొడుకు గౌతమ్‌ను దౌర్జన్యంగా తీసుకువెళ్లిపోయారని ఆరోపించారు. ఇప్పుడు ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications