తిరుమలలో శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో జే. శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. కాగా స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు.

ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సీవీ ఎస్ వో నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధంతో పాటు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

తిరుమలలో భక్తుల సంఖ్య మోస్తారుగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, సిబ్బంది శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. సోమవారం తిరుమలలో శ్రీవారిని 63,619 మంది భక్తులు దర్శించుకున్నారు. సోమవారం 28,572 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

సోమవారం భక్తులు శ్రీవారికి రూ. 3.78 కోట్లు హుండీలో సమర్పించుకున్నారు. సర్వదర్శనం టోకన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి రూ 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు మంగళవారం తెలిపారు. శ్రీవారి భక్తులతో వైకుంఠం కాంపెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. తిరుమలలో వాతావరణం చల్లగా ఉండటంతో కొండ మీద ఉండటానికి శ్రీవారి భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications