కెసిఆర్‌ను కలిసిన కోమటిరెడ్డి: మైండ్ గేమన్న పొంగులేటి
హైదరాబాద్: తాను కరుడుగట్టిన తెలంగాణ వాదినని, ఆ తర్వాతే కాంగ్రెస్ వాదినని మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఎల్‌బిసి సొరంగం పనులను పూర్తి చేయాలని సిఎంను కోరినట్లు తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ రహదారిపై పెండింగ్‌లో ఉన్న మెడికల్ కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు నెలలే అయిందని చెప్పారు. ఆ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆ తర్వాతే ప్రశ్నించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీ మార్పు ఊహాగానాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి మొదటి ముద్దాయి తెలుగుదేశం పార్టీ అయితే, రెండో ముద్దాయి కాంగ్రెసేనని కోమటిరెడ్డి ఆరోపించారు. పిసిసి చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు చేసిందేమి లేదని అన్నారు.

వలసలంటూ మైండ్‌గేమ్: టిఆర్ఎస్‌పై పొంగులేటి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కెసిఆర్‌ను కలిశారే తప్ప.. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌ను కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన వారు కేవలం నియోజకవర్గ సమస్యల మీద మాత్రమే ముఖ్యమంత్రిని కలిశారని చెప్పారు.
టిఆర్ఎస్ నేతలు మాత్రం ఎమ్మెల్యేల వలసలు అంటూ మైండ్‌గేమ్ ఆడుతున్నారని పొంగులేటి సుధాకర్ మండిపడ్డారు. రేషన్ కార్డులు, పింఛను కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఇంటివద్దనే కార్డులు ఇవ్వాల్సిందిపోయి.. వారిని ఆఫీసుల చుట్టూ తిప్పడం సరికాదని అన్నారు.
మన ఊరు-మన ప్రణాళిక పేరుతో సమగ్ర సర్వేలు చేసినా, మళ్లీ కార్డుల జారీలో మాత్రం అయోమయం నెలకొనడం కెసిఆర్ పాలన వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. ఏఐసిసి పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా బుధవారం ఢిల్లీ వెళ్తున్నారని, పార్టీ సంస్థాగత అంశంపై చర్చిస్తామని పొంగులేటి తెలిపారు. సర్వేలు, అప్లికేషన్ల పేరుతో ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు.












Click it and Unblock the Notifications