టీడీపీలో తెలంగాణవాదులు, హత్యచేసిన వ్యక్తే..: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పైన, ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరిగారు.
తెలంగాణ టీడీపీలోను కొందరు నిఖార్సయిన తెలంగాణవాదులు ఉన్నారని కితాబిచ్చారు. వారు తెరాసకు, తెరాస ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. తెలంగాణలో ఇంకా టీడీపీ ఉంటుందనుకోవడం భ్రమే అన్నారు. అలా అనుకోవడం రాజకీయ అమాయకత్వమే అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లో ఉంచుతున్న చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు ఇంకా ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఆ పార్టీలో ఎలా కొనసాగుతారన్నారు.

చీము, నెత్తురు లేనివారే ఇంకా టీడీపీలో కొనసాగుతారన్నారు. ఆ పార్టీలో కొందరు కల్తీ నాయకులు ఉన్నారని మండిపడ్డారు. ఆంధ్రా పెత్తనం కోరుకునే, ఆంధ్రా ఎంగిలి మెతుకులకు ఆశపడే నాయకులే టీడీపీలో ఉంటారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పైన కూడా కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ రైతుయాత్రలు చేపట్టడం విడ్డూరమన్నారు. రైతుల కన్నీళ్లకు 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణమన్నారు. రైతులను క్షమాభిక్ష కోరిన తర్వాతే వారు రైతు యాత్ర చేపట్టాలన్నారు. హత్య చేసిన వ్యక్తే పరామర్శకు వెళ్లినట్లుగా కాంగ్రెసు తీరు ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలు ఆస్తులు కాకుండా కరెంట్ కోతలను ఆస్తులుగా ఇచ్చారని ఎద్దేవా చేశారు. గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ వారు ఏనాడైనా రైతులను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రుణమాఫీకి రూ.4,250 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. అలాగే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసిందన్నారు.












Click it and Unblock the Notifications