స్టార్ ఆల్ రౌండర్ రెడ్డికి బిగ్ షాక్: ఏకంగా 8 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధించిన ఐసీసీ
భారత సంతతికి చెందిన అమెరికాన్ స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ బొడుగుమ్ అఖిలేష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినందుకు కఠిన చర్యలు తీసుకున్నారు. ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ విచారణలో అతను దోషిగా తేలడంతో అన్ని రకాల క్రికెట్ పోటీల నుంచి ఎనిమిదేళ్ల పాటు నిషేధం విధించారు. ఈ నిషేధ కాలం 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ రోజు నుంచే అతడిపై ఐసీసీ తాత్కాలిక సస్పెన్షన్ విధించడంతో నాటి నుంచే వర్తింపజేస్తున్నట్లు ఐసీసీ తెలిపింది.
యూఏఈ వేదికగా జరిగిన అబుదాబి టీ10 లీగ్ ఎడిషన్‌లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు అఖిలేష్ రెడ్డిపై ఉన్నాయి. ఈ లీగ్‌లో అవినీతి నిరోధక విభాగాన్ని పర్యవేక్షించే పూర్తి బాధ్యతలను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అప్పగించింది ఐసీసీ. ఈ టోర్నీ జరిగిన సమయంలో మ్యాచ్ ఫలితాలను తప్పుదారి పట్టించేలా ప్రభావితం చేయడానికి అఖిలేష్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. దీంతో గత ఏడాది నవంబర్ లో అతన్ని సస్పెండ్ చేసింది ఐసీసీ. దోషిగా తేలడంతో ఎనిమిదేళ్ల నిషేధాన్ని విధించింది.

అఖిలేష్ రెడ్డి మూడు నియమాలను ఉల్లంఘించినట్లు ట్రిబ్యునల్ నిర్ధారించింది. మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించడం, ఫలితాలను మార్చేందుకు కుట్రలు పన్నడం ఐసీసీ యాంటీ కరప్షన్ ఆర్టికల్ 2.1.1 ప్రకారం.. మొదటి నేరం. అలాగే ఇతర సహచర ఆటగాడిని కూడా ఇటువంటి అవినీతి చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం, వారిని కూడా నిబంధనలు ఉల్లంఘించేలా ప్రేరేపించడం ఆర్టికల్ 2.1.4 కింద తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది ఐసీసీ.
వీటితో పాటు ఐసీసీ విచారణను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి కూడా అఖిలేష్ రెడ్డి ప్రయత్నించినట్లు నిర్ధారించారు. తన మొబైల్ ఫోన్ నుండి కీలకమైన సమాచారం, చాటింగ్ వివరాలు, మెసేజీలను డిలెట్ చేయడం ద్వారా దర్యాప్తునకు సహకరించకుండా ఆధారాలను మాయం చేసే ప్రయత్నం చేశాడు. ఆర్టికల్ 2.4.7 కింద దీన్ని నేరంగా పరిగణించింది ఐసీసీ. ఈ మూడు నిబంధనల ఉల్లంఘన కింద ట్రిబ్యునల్ అతడిని దోషిగా తేల్చింది.
అమెరికా జాతీయ జట్టు తరఫున ఆడిన అఖిలేష్ రెడ్డి కెరీర్ ఒక్కసారిగా పతనమైంది. ఇప్పటివరకు అతను అమెరికా తరఫున నాలుగు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. నార్త్ అమెరికా టీ20 కప్‌లో కేమన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అతను అంతర్జాతీయ క్రికెట్ రంగప్రవేశం చేశాడు. 26 ఏళ్ల వయసులోనే ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిషేధం పడటంతో అతని క్రికెట్ భవిష్యత్ ముగిసిపోయినట్టయింది.













Click it and Unblock the Notifications