కాశ్మీర్ ను తలపిస్తున్న తెలంగాణలోని ఆ జలపాతం అందాలు.. ఎక్కడంటే..?
ఆదిలాబాద్ జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చుట్టూ కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు, సెలయేర్లు.. ఇలా ఒక్కటేమిటి సహజసిద్ధమైన అందాలతో తెలంగాణలోనే ఆదిలాబాద్ జిల్లా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉంది. ఈ జిల్లాలోనే తెలంగాణలోని ప్రముఖమైన కుంటాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు ఉన్నాయి.
వర్షాకాలంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతుంటాయి. కనుచూపు మేర నెలకున్న పచ్చని వాతావరణం, చుట్టు పక్కల కమ్మేసిన పొగమంచుతో కూడిన ఖండాల ప్రాంతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఈ ఖండాల పర్యాటక ప్రాంతం కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రాంతం తెలంగాణ కాశ్మీర్ గా ప్రసిద్ధి గాంచిన సంగతి తెలిసిందే.
ఖండాల ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా మారింది. చుట్టూ ఎటు చూసినా పచ్చదనం, కొండల పైనుంచి జాలువారే జలపాతాలు, పొగమంచుతో పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. వర్షాకాలపు సీజన్ అందాలను వీక్షించేందుకు కేవలం ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం పర్యటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దాంతో ఈ ప్రాంతం పర్యటకులతో కిటకిటలాడుతోంది. ఎండా, వానా చలి అని తేడా లేకుండా అన్ని కాలాల్లోనూ ఇక్కడ కాశ్మీర్ ను తలపించేలా ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు కనువిందు చేస్తున్నాయి. ఖండాల జలపాతంతో పాటు ఇచ్చోడ మండలంలోని గుండి వాగుపై దాదాపు 350 అడుగుల ఎత్తు నుంచే గాయత్రి జలపాతం జాలువారుతుంది. వర్షాకాలంలో ఈ అందాలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఖండాల జలపాతం అందాలను వీక్షించేందుకు ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ తోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వీకెండ్స్ లో అనేక ప్రాంతాల ప్రజలు తరలివస్తుంటారు. హైదరాబాద్ నుంచి ఈ ప్రకృతి రమణీయమైన ప్రాంతం సుమారు 300 కిలోమీటర్లకు పైగా ఉంది. ప్రయాణ సమయం సుమారు 6 నుంచి 7 గంటలు పడుతుంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే ఎన్ హెచ్ 44 గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీతోపాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications