Blue Drum Murder Case: బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో సంచలనం.. మృతుడి భార్య, ఆమె ప్రియుడే దోషులు..
గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనల్లో బ్లూ డ్రమ్ మర్డర్ కేసు ఒకటి. కట్టుకున్న మొగుడ్నే కిరాతకంగా చంపి డ్రమ్ములో కుక్కింది ఓ మహిళ. ఆమెకు ప్రియుడు సహకరించాడు. అయితే ఎన్నో వాదోపవాదాలు జరిగిన తర్వాత తాజాగా ఈ కేసులో ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మృతుడు సౌరభ్ రాజ్ పుత్ ను అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి కిరాతకంగా హతమార్చారని తేల్చింది. ఈ మేరకు వారిద్దరినీ దోషులుగా తేల్చుతూ కీలక తీర్పును వెల్లడించింది. ఈ మేరకు జిల్లా కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సంచలన తీర్పును వెలువరించారు. ఈ కేసులో కాంక్రీట్ తో నింపిన బ్లూ డ్రమ్ ప్రధాన ఆధారంగా జిల్లా కోర్టు తేల్చింది. సౌరభ్ రాజ్ పుత్ బాడీ దొరకకుండా బ్లూ డ్రమ్ లో వేసి దానిపై కాంక్రీట్, సిమెంట్ తో పూడ్చారని వివరించింది.
ఈ కేసులో భాగంగా మేరఠ్ జిల్లా కోర్టు 126 వాదనలు.. 22 మంది సాక్షులను విచారించింది. అనంతరం జిల్లా కోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా కీలక తీర్పును వెల్లడించారు. మాజీ మెర్చంట్ నేవీ అధికారి అయిన సౌరభ్ రాజ్ పుత్ ను చంపేందుకు ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లా కలిసి కుట్ర పన్నారని తేల్చారు. ఆ తర్వాత అతని శవం దొరక్కుండా ఓ బ్లూ డ్రమ్ లో బాడీ వేసి దానిపై సిమెంట్, కాంక్రీట్ తో పూడ్చారని వివరించారు. అయితే ఈ కేసులో దోషులకు శిక్ష ఇంకా నిర్ణయించలేదు. ఈ క్రమంలో త్వరలోనే వారికి శిక్షను ప్రకటించే అవకాశం ఉంది.

ఏం జరిగిందంటే..?
మేరఠ్ కు చెందిన మాజీ మెర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పుత్ భార్య ముస్కాన్ రస్తోగికి సాహిల్ శుక్లాతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న భర్తను హతమార్చాలని ఇద్దరూ ప్లాన్ వేశారు. పథకం ప్రకారం సౌరభ్ రాజ్ పుత్ ను హత్య చేశారు. అది ఎలా ఉంటే..? భోజనంలో నిద్ర మాత్రలు కలిపి, భర్త నిద్రలో జారుకున్నాక ప్రియుడితో కలిసి హత్య చేసింది ముస్కాన్ రస్తోగి. అంతేకాక శవాన్ని 15 ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్ తో కప్పిపెట్టారు. అనంతరం ఇద్దరూ కలిసి మనాలి పారిపోయారు. గతేడాది మార్చిలో జరిగిన ఈ ఘటన మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే సౌరభ్ రాజ్ పుత్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాను తమదైన శైలిలో విచారించగా నేరం చేసినట్లు వాళ్లు ఒప్పుకున్నారు.












Click it and Unblock the Notifications
