బూర్గులకు, కిరణ్‌కు ఉన్న తేడానే మనకు: కెటిఆర్ స్పీచ్
హైదరాబాద్: బూర్గుల రామకృష్ణా రావుకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న తేడానే తెలంగాణకు, సీమాంధ్ర ప్రాంతానికి ఉన్న తేడా అని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం శాసన సభలో అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి బూర్గుల నాడు ఆంధ్రప్రదేశ్‌కు అంగీకరించారని, కిరణ్ మాత్రం ఇప్పుడు ధిక్కరిస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు విఫల ప్రయోగమని, చారిత్రక తప్పిదమని గుర్తించి కేంద్రం దానిని సవరిస్తోందన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లును తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మెజార్టీలు మైనార్టీలను అణచవద్దని ఆర్టికల్ 3ని అంబేడ్కర్ పొందుపర్చారన్నారు. పదమూడేళ్లలో తెలంగాణ ఉద్యమం గడపగడపకు, గుండె గుండెకు వెళ్లిందన్నారు. 1969 నాటి ప్రతికూలతలు పక్కన పెట్టి నేటి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లామన్నారు.

నాటు ఆంధ్రా ప్రాంతంలో సరైన రాజధాని, ఆస్తులు లేకనే హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడిందన్నారు. కుట్రలు, కుతంత్రాలతే ఏర్పడిందే ఆంధ్రప్రదేశ్ అన్నారు. నాడు ఆంధ్రా ప్రాంతం బాధలే నేడు తెలంగాణ ఎదుర్కొంటోందని చెప్పారు. సీమాంధ్రుల ఆందోళనతో తాను కొంత ఏకీభవిస్తున్నానని చెప్పారు. ఎపి రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణ అభివృద్ధి బాధ్యత తీసుకుంటామని తీర్మానం చేశారన్నారు. కొన్ని షరతులు, ఒప్పందాలతో రాష్ట్రం ఏర్పడిందన్నారు.
విభజన సమయంలో తెలంగాణ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారని, నాటి భయాలు నిజమయ్యాయన్నారు. నాడు తెలంగాణ పదాన్ని సభలో నిషేధించారని, ఇప్పుడు అదే పతాక శీర్షికలకు ఎక్కిందని చెప్పారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర సమితి, తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వల్లనే సాధ్యమైందన్నారు. శాంతియుతమార్గంలో, రాజకీయ ప్రక్రియ ద్వారానే ఉద్యమం నడిచిందన్నారు.
బిల్లు ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలతో రాలేదు
తెలంగాణ ముసాయిదా బిల్లు ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలతో రాలేదన్నారు. తెలంగాణ బిల్లును రాత్రికి రాత్రి తెచ్చారని, ఏకాభిప్రాయం లేదని కొందరు చెబుతున్నారని కానీ, అది సరికాదన్నారు. సంప్రదింపుల తర్వాతే బిల్లు వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమం శాంతియుత మార్గంలో జరిగిందన్నారు. చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు కొందరు నేతలు అభిప్రాయాలు చెప్పడం సరికాదన్నారు. 1954లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఫజల్ అలీ కమిషన్ చెప్పిందన్నారు.
నాడు రాజధానిగా కర్నూలును త్యాగం చేశారని సీమాంధ్ర నేతలు చెబుతున్నారని కానీ, నాడు ఆ పట్టణం దుస్థితి తెలుసుకోవాలన్నారు. గుడారాల్లో ఆఫీసులు నడుపుకున్నారని, నాటి గవర్నర్ త్రిపాఠి సందర్శించారంటూ ఓ ఫోటోను కెటిఆర్ చూపించారు. ఇదే సమయంలో పలువురు నేతలు ఆంధ్రా దుస్థితిపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు చెప్పారు. సమైక్య రాష్ట్రం కోసం నాడు హైదరాబాదు రాష్ట్రంలో చర్చ మాత్రమే జరిగిందని ఓటింగ్ జరగలేదన్నారు.
తెలుగు వారు ఐదారు వందల సంవత్సరాలు మినహా ఎక్కువ కాలం కలిసి లేరన్నారు. శాలివాహనులు, కుతుబ్‌షాలు, కాకతీయుల కాలంలో మాత్రమే కలిసి ఉందన్నారు. ఎపి ఏర్పడే నాటికి తెలంగాణ సర్ ప్లస్‌లో ఉంటే, ఆంధ్రాలో లోటు బడ్జెట్ ఉందన్నారు. నాడు తెలంగాణలో తలసరి ఆదాయం రూ.17 ఉంటే, ఆంధ్రాలో రూ.9 ఉందన్నారు. కాకినాడ, విశాఖ, రాజమండ్రి, గుంటూరు జిల్లాలు రాజధానిగా ఏర్పడేందుకు అప్పుడు అనుకూలంగా లేవని, మిగిలింది ఒక్క హైదరాబాదే అన్నారు.
పయ్యావుల 'ఆంధ్రా'కు వివరణ
ఆంధ్రా అనే పదం తెలంగాణవారే ఉపయోగించారని పయ్యావుల కేశవ్ చెప్పారని కానీ, తెలుగుకు అనే అర్థానికి పర్యాయపదంగా మాత్రమే ఆంధ్రాను నాడు ఉపయోగించారన్నారు. కాళోజీ నారాయణ రావు, రావి నారాయణ రెడ్డి, సర్దార్ గౌతు లచ్చన్నలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక తమ ఆవేదనను వ్యక్తం చేశారని చెబుతూ.. వారు చెప్పిన విషయాలని కెటిఆర్ చెప్పారు. హిందీ భాషకు ఆరు రాష్ట్రాలు ఉండగా, తెలుగు భాషకు రెండు ఉంటే తప్పేమిటని లచ్చన్న చెప్పారన్నారు.
విశాలాంధ్ర కోరుకున్న కాళోజీ ఆ తర్వాత మనసు మార్చుకున్నారని, తెలంగాణను అభివృద్ధి చేస్తారనుకున్న తమ ఆశలు నెరవేరలేదని రావి నారాయణ రెడ్డి చెప్పారన్నారు. చరిత్రను ఒకవైపే చూపించవద్దన్నారు. ఒక రాష్ట్రం, ఒక భాష అని అంబేడ్కర్ చెప్పారని అయితే, ఒకటి కెంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండవద్దని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. 1936లోనే భాషాప్రయుక్త రాష్ట్రంగా ఒడిషా ఏర్పడిందని తెలిపారు. మొదటి ఎస్సార్సీలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రస్తావన లేదని చెప్పారు.
చరిత్ర ఇలా ఉంటే అనాగరికంగా ఉన్న తెలంగాణ ప్రాంతానికి తామే అన్నీ నేర్పామని చెప్పడం సరికాదన్నారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రా ప్రాంతాన్ని గట్టెక్కించేందుకే తెలుగు జాతి అన్నారన్నారు. విశాలాంధ్ర వెనుక సామ్రాజ్యవాద విస్తరణ దాగి ఉందని నాడు జవహర్ లాల్ నెహ్రూ చెప్పారన్నారు. తెలంగాణలోని మిగులు నిధులు ఇక్కడే ఖర్చు పెడతామని చెప్పి ఆంధ్రాకు తరలించుకు పోయారన్నారు. తమిళనాడు నుండి మీరు వేరుపడితే ఆత్మగౌరవం, తాము వేరుపడతామంటే విచ్చిన్నవాదమా అన్నారు.
మీది నైతికత.. మాది విచ్ఛిన్నతా
నాడు మద్రాసు నుండి మీరు విడిపోతే నైతికత, తాము తెలంగాణ కోరితే అనైతికతనా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా కలిసి ఉండాలని సీమాంధ్ర నేతలు కోరడమేమిటన్నారు. ఇదేమైనా సామంత రాజ్యమా అన్నారు. విడిపోయేందుకు ఏకాభిప్రాయం అడిగేవారు, కలిసి ఉండేందుకు ఎందుకు అడగడం లేదన్నారు. నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది తెలంగాణ ప్రజలే అన్నారు.
నయా పెత్తందార్లకు, వలసవాదులకు ఇప్పుడు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతోందన్నారు. అన్నదమ్ముల్లా కలిసుండాలన్న పయ్యావులకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, కిరణ్ రెడ్డి సోదరులు కలిసే ఉంటున్నారా అని ప్రశ్నించారు. భార్యా భర్తలే కలిసి ఉండలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు విడ్డూరమన్నారు. శాసన సభలోనే స్పష్టమైన చీలిక కనిపిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కలిసుందామని చెప్పడం సీమాంధ్ర ప్రజలను ఇంకా వంచించడమే అన్నారు.
శైలజానాథ్, పయ్యావుల కేశవ్‌లు మాట్లాడుతుంటే తాము దేశం నుండి విడిపోతున్నామా అనే అనుమానం కలిగిందన్నారు. రాష్ట్రంగా మొట్టమొదట విడిపోయింది మీరే అన్నారు. మద్రాసు నుండి విడిపోయేందుకు కేంద్రం అంగీకరించినా... ఆ తర్వాత పొట్టి శ్రీరాములును పోగొట్టుకున్నారని విమర్శించారు. తెలుగు జాతి సమైక్యత కష్టాల్లో ఉన్న నాటి ఆంధ్రా ప్రాంతాన్ని గట్టెక్కించుకోవడానికే అన్నారు. ఏకపక్షంగా కలిసి ఉండాలనడం ఈ శతాబ్దంలోనే వింత అన్నారు.
విద్యార్థులపై వివక్ష
రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో తక్కువ విశ్వవిద్యాలయాలు ఉండగా, సీమాంధ్రలో ఎక్కువ ఉన్నాయని అది వివక్ష కాదన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులపై వివక్ష కనిపిస్తోందని ఉదాహరణలు చెప్పారు. గ్రూప్ వన్ పరీక్షల్లో ప్రాంతీయ వివక్ష ఉందన్నారు. సీమాంధ్రులు లేవనెత్తే ప్రతి దానికి సమాధానం చెప్పే సత్తా తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. మొత్తం 18 విశ్వవిద్యాలయాలు ఉంటే సీమాంధ్రలో 11, తెలంగాణలో 7 మాత్రమే ఉన్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు లక్ష కారణాలు చెబుతామని, కలిసుండేందుకు ఒక్క కారణం చెప్పలేకపోతున్నారన్నారు. తెలంగాణ కోల్పోయింది కొన్ని ఉద్యోగాలు మాత్రమే కాదని, కొన్ని తరాల జీవితమన్నారు. దానిని సవరించుకునేందుకే తెలంగాణ కోరుతున్నామన్నారు. బూర్గుల రామకృష్ణా రావుకు వ్యక్తిగతంగా ఏ అభిప్రాయం ఉన్నా అధిష్టానం మాట విని సమైక్యాంధ్రకు మొగ్గు చూపిన మహానుభావులన్నారు. నేటి సిఎం కిరణ్ మాత్రం ధిక్కరిస్తున్నారన్నారు.
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన కిరణ్ ఇప్పుడు సమైక్యవాదం వినిపిస్తున్నారని విమర్శించారు. బూర్గులకు, కిరణ్‌కు ఉన్నా తేడానే తెలంగాణకు, సీమాంధ్రకు మధ్య ఉందన్నారు. ఢిల్లీలో మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడిపిన పివి నర్సింహా రావు.. ముఖ్యమంత్రిగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడాది నడపలేకపోయారంటే సీమాంధ్రులు, తెలంగాణకు ఉన్న తేడా తెలుసుకోవచ్చునన్నారు.
610 జివో ముప్పై ఏళ్లు గడుస్తున్నా అమలు కాలేదని, 574 జివో మాత్రం వెంటనే అమలైందన్నారు. మేఘాలయ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆర్టికల్ 371డిని సవరించలేదని చెప్పారు. ముఖ్యమంత్రులు రాష్ట్ర ఏర్పాటుకు సహకరించకుంటే వారిని పక్కన పెట్టి ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇందిరా గాంధీ రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్నారు. ఆమె ఐదు రాష్ట్రాలను ఇచ్చారన్నారు. తమ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోలేని జాతి ఏదైనా దేశంలో ఉందా అంటే తెలంగాణ జాతి మాత్రమే అన్నారు.
అంగీకరించినందుకు థ్యాంక్స్
దేశంలో రాష్ట్రాల ఏర్పాటుకు నిర్దిష్ట సంప్రదాయాలు, శాస్త్రీయ పద్ధతులు లేవన్నారు. వట్టి వసంత్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే సవరించుకుందామని అన్నారని, అంగీకరించినందుకు కృతజ్ఞతలు అన్నారు. అయితే, వట్టి ముందే కిరణ్తె లంగాణకు ఒక్క పైసా ఇవ్వనని, రాసుకోండని అన్నప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. సీమాంధ్ర సోదరుల పరిస్థితు చూస్తుంటే వారికేం కావాలో అర్థం కాని తీరు ఉందన్నారు.
తెలుగు జాతి గురించి గొప్పగా చెప్పే వారు సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అని ఆంగ్లంలో రాస్తారన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు తమకు ఆదర్శమన్నారు. విభజన వాది అయిన శ్రీరాములుకు పాలాభిషేకం, సమైక్యవాదులు అయిన ఇందిర, నెహ్రూ విగ్రహాలను నిప్పు పెడతారన్నారు. క్రికెట్‌కు రెండు, ఉద్యోగ సంఘాలకు రెండు ఎన్జీవోలు ఉండవచ్చు కానీ రాష్ట్రాలు రెండు ఉంటే తప్పేమిటన్నారు. తెలంగాణ బిల్లును భోగి మంటల్లో కాలుస్తూనే మరోవైపు సమయం కావాలని గడువు కోరడమేమిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications