సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి అంత్యక్రియలపై అప్‌డేట్..!!
హైదరాబాద్: ప్రముఖ నటుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. కార్డియాక్ అరెస్ట్‌తో సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 4:09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

పెద్ద కుటుంబం..
కృష్ణకు ఇద్దరు భార్యలు. ఇందిరా దేవి, విజయనిర్మల. 2019లో విజయనిర్మల కన్నుమూశారు. ఇందిరా దేవి ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8వ తేదీన కిడ్నీ సంబంధిత ఇబ్బందులతో మరణించారు.

తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు..
కృష్ణ ఇక లేరనే సమాచారం తెలిసిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. లక్షలాది మంది అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తోన్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ఎంకే స్టాలిన్..దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సంతాపాల వెల్లువ..
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, అక్కినేని నాగార్జున, వెంకటేష్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత బండ్ల గణేష్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

రెండు రోజుల పాటు
కృష్ణ పార్థివ దేహాన్ని ఇంకాస్సేపట్లో గచ్చీబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్‌రామ్ గూడలోని నివాసానికి తరలించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 11:30 గంటలకు పార్థికదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం పద్మాలయా స్టూడియోస్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇంకా కుటుంబ సభ్యుల నుంచి తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

ఎల్లుండి అంత్యక్రియలు..
రెండు రోజుల పాటు ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. కృష్ణ పార్థివ దేహానికి ఎల్లుండి అంత్యక్రియలు జరుగనున్నాయి. పంజాగుట్ట మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. నిజానికి- బుధవారమే అంత్యక్రియలను నిర్వహించాలని తొలుత భావించారు. అష్టమి కావడం వల్ల వద్దనుకున్నారు. ఎల్లుండి అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications