కెసిఆర్‌కు షాక్: హైదరాబాద్ భద్రత గవర్నర్ చేతికి
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై సర్వాధికారాలను కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌కు అప్పగిస్తూ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతి భద్రతల విషయంలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం లేఖ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పినట్లు హైదరాబాద్‌లో శాంతిభద్రతల నిర్వహణ బాధ్యత గవర్నర్‌కే ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, గవర్నర్ ముఖ్య కార్యదర్శి ఎన్.రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు.

ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతి భద్రతల బాధ్యతలను గవర్నర్ పర్యవేక్షిస్తారని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే చట్టంలో కొంత అస్పష్టత ఉందని, తన అధికారాలపై మరింత స్పష్టత ఇవ్వాలంటూ గవర్నర్ నరసింహన్ కొద్దికాలం కిందట కేంద్రానికి లేఖ రాశారు.
దీంతో హైదరాబాద్‌లో శాంతి భద్రతల అంశాన్ని గవర్నర్‌కు అప్పగించడానికి సంబంధించి కొన్ని ముసాయిదా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వానికి పంపిన కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీనిపై అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ప్రతిపాదనకు అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి కూడా ఇదే విధమైన లేఖను నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి రాశారు. దానిని కూడా తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతల అంశాన్ని గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం నేరుగా మార్గదర్శకాలనే జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లూ జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపుగా ఉమ్మడి పోలీసింగ్ వ్యవస్థ అమల్లో ఉంటుంది. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణకు అవసరమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసు సిబ్బందిని, అధికారులను రప్పించి ఇక్కడ నియమించుకునే అధికారాన్ని గవర్నర్‌కు కల్పించారు.
పోలీసు యంత్రాంగం మొత్తం గవర్నర్‌కు జవాబుదారీగా ఉంటుంది. విధి నిర్వహణలో గవర్నర్‌కే రిపోర్టు చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేయడంతో మొత్తం పోలీసు వ్యవస్థ గవర్నర్ అధీనంలోకి వెళ్లినట్లు అయింది. ఏ రాష్ట్ర పోలీసులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికే జవాబుదారీగా ఉంటారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులను నియమిస్తారు.












Click it and Unblock the Notifications