శ్రీవారిని దర్శించుకున్న లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా: స్వాగతం పలికిన టీటీడీ ఛైర్మన్, వైసీపీ ఎంపీలు
తిరుపతి: తిరుమల శ్రీవారిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ ఓం బిర్లాకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
స్పీకర్ ఓం బిర్లా ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ఆ తరువాత మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈఓ కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, కాఫీ టేబుల్ బుక్ అందించారు.
ఆ తర్వాత స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలందరిపై స్వామివారి కృప ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అందరికీ శుభం కలగాలని, ప్రపంచంలో భారత్ అగ్రదేశంగా ఎదగాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, గురుమూర్తి, భరత్, కలెక్టర్ హరినారాయణన్, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన లోక్‌సభ స్పీకర్
లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. వేద విజ్ఞాన పీఠానికి చేరుకున్న స్పీకర్ కు ఇక్కడి వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరంలో గల శ్రీవేంకటేశ్వరస్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్పీకర్ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శాలువ, శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలతో స్పీకర్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, గురుమూర్తి, భరత్, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కపిలేశ్వరస్వామివారిని దర్శించుకున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. టిటిడి జెఈఓ సదా భార్గవి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ గురుదక్షిణామూర్తి, నవగ్రహాలను దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, జెఈఓ సదా భార్గవి స్పీకర్ కు కండువా, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, డాక్టర్ గురుమూర్తి, భరత్, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి,ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, విఎస్వో మనోహర్ పాల్గొన్నారు.

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద స్పీకర్ కు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో సదా భార్గవి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంబానికి మొక్కు కున్న అనంతరం ఓంబిర్లా అమ్మవారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పీకర్‌కు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అందించారు. ఎంపీ లు విజయసాయిరెడ్డి, పివి మిథున్ రెడ్డి, ఎం. గురుమూర్తి , డిప్యూటీ ఈవో కస్తూరి బాయి పాల్గొన్నారు. దేశం క్షేమంగా ఉండాలని కోరుకున్నా దేశం క్షేమంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయారారోగ్యాలతో ఉండాలని పద్మావతి అమ్మవారిని కోరుకున్నానని స్పీకర్ శ్రీ ఓం బిర్లా చెప్పారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం రాత్రి కుటుంబ సమేతంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద స్పీకర్ కు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జేఈవో సదా భార్గవి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్థంబానికి మొక్కు కున్న అనంతరం ఓంబిర్లా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దర్శించుకున్నారు.

ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 17న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను జరుపుతారు.
పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 18న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 19న పవిత్ర సమర్పణ, ఆగస్టు 20న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు
పవిత్రోత్సవాల్లో ఆగస్టు 17న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్ధు చేసింది. అదేవిధంగా, ఆగస్టు 18 నుండి 20వ తేదీ వరకు వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications