కవితకు లండన్ కాలేజ్ ఆహ్వానం, మానవత్వం: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితకు లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుండి ఆహ్వానం వచ్చింది. వచ్చే నెల రెండు నుండి పదో తేదీ వరకు జరిగే విద్యా కార్యక్రమానికి కవితకు నిర్వహకులు ఆహ్వానం పంపించారు.
అక్కడి విద్యార్థులు, పరిశోధకులను ఉద్దేశించి ప్రసంగించేందుకు భారత దేశం నుండి పార్లమెంటు సభ్యులను ఈ కాలేజీ ఆహ్వానిస్తోంది.
పరిపాలన - ప్రజావిధానాల సంస్థ, విధాన పరిశోధనల కేంద్రం, విదేశీ, కామన్వెల్త్ కార్యాలయం, కింగ్స్ కాలేజీ లండన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెలలో జరిగే కార్యక్రమానికి బారత్ నుండి హాజరు కావాలని కవితను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కవిత అంగీకరించారు. వచ్చే నెల ఒకటో తేదీన ఆమె లండన్ వెళ్తారు.

విశాఖకు విద్యుత్ సామాగ్రి: కేటీఆర్
ఏపీ ప్రభుత్వం వద్ద మిగులు విద్యుత్తు ఉందని, తెలంగాణకు రావాల్సిన వాటా కూడా ఉందని, అయినప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్తు ఇవ్వకూండా రాజకీయం చేస్తున్నారని, ఇది ప్రజల జీవితాలతో చెలగాటమాడటమేనని, ఇది శాడిజమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సోమవారం మండిపడ్డారు.
హుధుద్ తుఫాను పైన తెలంగాణ ప్రభుత్వం మానవత్వంతో స్పందించి విశాఖకు రూ.17 కోట్ల విద్యుత్తు సామాగ్రి పంపిస్తోందని చెప్పారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి.. గతంలో అదికారంలో ఉన్న ప్రభుత్వాలకు చెందినవారని, తెలంగాణను అన్నిరకాలుగా దోచుకున్నారన్నారు. వారు ఇప్పుడు తెరాస ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకే రోడ్ల మీదపడి ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ తిరుగుతున్నారని విమర్శించారు.
దొంగలే దొంగ దొంగ అన్నట్లుగా వారి తీరు ఉందన్నారు. ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని, నాలుగు నెలల పసిగుడ్డుగా ప్రభుత్వం ఉందని, సమస్యలన్నింటిని పరిష్కరిస్తామన్నారు. 2018 చివరినాటికి ఏపీకి కూడా కరెంట్ ఇచ్చే దశకు చేరుకుంటామన్నారు. ఏపీలోని కృష్ణపట్నం విద్యుత్తు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ ట్రయల్ రన్ పేరిట చంద్రబాబు ప్రారంభించడం లేదన్నారు.
అందులో తెలంగాణకు చెందిన రూ.500 కోట్ల పెట్టుబడులు ఉన్నాయన్నారు. తెలంగాణకు కరెంట్ ఇవ్వాల్సి వస్తుందనే ఈ కేంద్రాన్ని ప్రారంభించడం లేదన్నారు. గతంలో విద్యుత్తు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ కరీంనగర్‌లోని నేదునూరు విద్యుత్తు ప్లాంటుకు గ్యాస్ సరఫరా కోసం కేంద్రాన్ని అడగకుండా విజయవాడలోని లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకుకో గ్యాస్ సరఫరా కోరారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications