ఓటర్లే సిగ్గుపడాలి: ‘2019’పై చంద్రబాబు సంచలనం, జగన్ చురక, ‘ప్రేమించుకోవాలి’

Subscribe to Oneindia Telugu

అమరావతి: సమాజంలో ద్వేషం, ఉద్రేకంతో నేరాలు పెరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సమాజంలో అశాంతి మంచిది కాదని అన్నారు. మనిషిని మనిషి ప్రేమించే వాతావరణం ఉండాలని అన్నారు. మంచిని మానవత్వాన్ని పెంచుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

భవిష్యత్తులో ఎవరైనా నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలీసులకు సూచించారు. ఇటీవల రాజమహేంద్రవరంలోని మసీదులో మౌజన్‌ హత్య కేసుపై రియల్‌ టైం గవర్నెన్స్‌ సెంటర్‌ నుంచి సోమవారం ఆయన సమీక్షించారు. 48 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేయడంపై ముఖ్యమంత్రి పోలీసులను అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

నేరం చేసినవారు తప్పించుకోవద్దు

నేరం చేసినవారు తప్పించుకోవద్దు

గతంలో కాకినాడలో చిన్నారి అపహరణ కేసును కూడా గంటల వ్యవధిలోనే ఛేదించగలిగామని, నేర పరిశోధనలో సాంకేతికత పెద్దఎత్తున వినియోగించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నేర నిరోధంలో పోలీసులు తీసుకుంటున్న చర్యల్ని సీఎంకు డీజీపీ మాలకొండయ్య వివరించారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నేరం చేసి తప్పించుకొనే పరిస్థితులు ఉండడానికి వీలు లేదని సీఎం అన్నారు.

రాజమహేంద్రవరం నగరం లాలా చెరువు ప్రాంతంలో ఓ ప్రార్థనా మందిరంలో మౌజన్‌గా సేవలందిస్తున్న మహ్మద్‌ ఫరూక్‌ను గురువారం అర్ధరాత్రి హత్యచేసిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌కు కరెంటు, నీళ్లిచ్చా..

హైదరాబాద్‌కు కరెంటు, నీళ్లిచ్చా..

శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎదురవుతున్న ఒక్కో సమస్యను జాగ్రత్తగా అధిగమిస్తూ ముందుకెళ్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురిశాయని, విద్యుత్‌ వినియోగం కూడా తగ్గిందన్నారు. తద్వారా రూ.250 కోట్ల వరకు విద్యుత్‌ పొదుపు వచ్చిందని తెలిపారు. కాగా, హైదరాబాద్‌కు కరెంటు, నీళ్లు తానే ఇచ్చానని చంద్రబాబు చెప్పారు.

జగన్‌కు చురకలు

జగన్‌కు చురకలు

ప్రజల కోసం ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ ఎక్కడో చోట రాజకీయంగా ఇబ్బంది పెట్టేవారు ఉంటున్నారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 99 మంది ఒక పద్ధతి ప్రకారం వస్తే.. ఒక్కరు అడ్డుతగిలే వారు ఉంటూ వేలాది మంది ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, విగ్రహాల ధ్వంసం చేయడం తదితర ఘటనలకు కొందరు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. అలాంటి కుట్రలను విజ్ఞతతో ప్రజలు తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

అన్ని రంగాల్లో ప్రగతి

అన్ని రంగాల్లో ప్రగతి

2017లో అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించినట్టు తెలిపారు. దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక సమస్యలు అధిగమించగలిగామని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హారతి వల్ల ప్రజల్లో పెద్దఎత్తున చైతన్యం వచ్చిందన్నారు. తాము అనుకున్న టెక్నాలజీ అందుబాటులోకి వస్తే గనక నేరాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రజలంతా ఏకమై సమాజంలో అశాంతిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మనిషి మనిషిని గౌరవించుకొనే సంప్రదాయం రావాలని ఆకాంక్షించారు. వినూత్నంగా జన్మభూమి -మా ఊరు కార్యక్రమం చేపట్టి సంక్రాంతి కానుక ఇస్తామన్నారు. అందరూ పండుగ చేసుకొనేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ ఏడాది చేపట్టే అందరి పండుగ, అతిపెద్ద పండుగ జన్మభూమి- మా ఊరు కార్యక్రమమేనన్నారు.

పోలవరం పురోగతిపై..

పోలవరం పురోగతిపై..

కాగా, సోమవరం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపైనా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో 48వ సారి వర్చువల్ రివ్యూ జరిగింది. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 31 మధ్య 21 రోజుల పాటు జరిగిన పనులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రెండు నెలల విరామం తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం మళ్లీ తవ్వకం పనులను త్రివేణి సంస్థ తిరిగి మొదలుపెట్టిందని సీఎంకు తెలిపారు. కాగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పోలవరంపై సవివరంగా వివరించినట్లు సీఎం తెలిపారు. ఆయనకు ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోందని చెప్పారు. ట్రాన్స్ ట్రాయ్ దివాలపై చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. తనకు ఏ కాంట్రాక్టర్‌పై ఆసక్తి లేదని, 2019వరకు పోలవరం పూర్తవుతుందని తెలిపారు.

ఓటర్లే సిగ్గుపడాలి

ఓటర్లే సిగ్గుపడాలి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘2019 ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది. ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల పార్టీ ఓడిపోతే.. పార్టీని ఓడించినందుకు ఓటర్లే సిగ్గుపడతారు. ఎందుకు గెలిపించుకోలేకపోయాం అని వాళ్లే ఆలోచించుకోవాలి. ఓటేయకుండా మేము తప్పుచేశాం అనే పరిస్థితి రావాలన్నారు. అంతలా నేను కష్టపడుతున్నాను. నేను అన్నీ చేసిన తర్వాత నాకు ఎందుకు ఓటు వేయకూడదండి. ఇప్పటి వరకూ ఉన్న పథకాలు, కార్యక్రమాలు కాకుండా ప్రజలు ఇంకేం కావాలి. అసలు నా కష్టానికి మీకు కూలి ఇవ్వాలా లేదా?' అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Monday said that peace is important in the society.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి