ఇలాగైతే వ్యాపారం చేయలేం, మద్యం ట్రేడర్ల బిగ్ షాక్ - ఏం జరుగుతోంది..!!
ఏపీ ఎక్సైజ్ శాఖలో మద్యం వ్యాపారుల టెన్షన్ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త బార్ల పాలసీలో భాగంగా టెండర్లు ఆహ్వానించింది. దరఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్నా నూతన బార్ విధానానికి స్పందన కనిపించటం లేదు. దీంతో, ఎక్సైజ్ అధికారులు టెండర్ దారుల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు టెండర్లు ఆహ్వానిస్తే ఇప్పటి వరకు కేవలం 34 మంది మాత్రమే దరఖాస్తు చేసారు. ఈ నెల 26వ తేదీ టెండర్లకు చివరి తేదీ.
వ్యాపారుల వెనుకడుగు
ఏపీలో నూతన బార్ పాలసీ ప్రకటన సమయం నుంచి కొత్త టెన్షన్ మొదలైంది. నిర్దేశించిన విధి విధానాల పైన మద్యం వ్యాపారులు ఆసక్తిగా లేరు. దీంతో, టెండర్ల గడువు సమీపిస్తున్నా వారి నుంచి ఆసక్తి కనిపించటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు లైసెన్స్‌లు ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీచేస్తే.. ఈ వారం రోజుల్లో కేవలం 34 దరఖాస్తులే వచ్చాయి. మరో రెండ్రోజులే గడువున్నా వ్యాపారుల్లో పెద్దగా స్పందన కనిపించకపోవడంతో ఎక్సైజ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త పాలసీ విఫలమవుతుందన్న ప్రచారం ఉధృతమైంది. ఆదివారం రాత్రి వరకు కృష్ణా జిల్లాలో 13, కర్నూలు-1, నంద్యాల-1, ఎన్టీఆర్-7, పల్నాడు-1, ప్రకాశం-3, తిరుపతి-1, విజయనగరం-1, కడప జిల్లాలో రెండు వచ్చాయి.

స్పందన కరువు
అధికారులు నిర్దేశించిన విధంగా వీటిలోనూ నాలుగు దరఖాస్తులు వచ్చిన బార్లు రెండే ఉన్నాయి. నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ తీయరు. అంటే లాటరీ తీయదగిన స్థాయిలో దరఖాస్తులు అందింది కేవలం రెండు బార్లకు మాత్రమే. కాగా సుమారు వెయ్యి మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. వారు రూ.5 లక్షలు చెల్లించి తుది దరఖాస్తులు సమర్పిస్తారా అనేది సందేహం గానే కనిపిస్తోంది. ఒకవేళ వారంతా దరఖాస్తులు సమర్పించినా 30 శాతం బార్లే లాటరీలోకి వస్తాయి. 840 బార్లకు లాటరీ తీయాలంటే మొత్తం 3,360 దరఖాస్తులు రావాలి. అది కూడా ప్రతి బార్‌కు నాలుగు చొప్పున దరఖాస్తులు అందాలి. ఒకవేళ ఏదైనా బార్‌కు నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వేస్తే మొత్తం దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరగాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చివరికి సగం బార్లకైనా వస్తాయా అనే టెన్షన్ ఎక్సైజ్ అధికారుల్లో కనిపిస్తోంది.
ఏం జరుగుతోంది
తొలి నుంచి బార్లకు ఇచ్చే మద్యంపై అదనపు పన్ను, నాలుగు దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధనలను వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. వారిని ఎక్సైజ్ అధికారులు ఎంత అనునయించినా ముందుకు రావడం లేదు. ప్రతికూలంగా ఉన్న నిబంధనలను సవరిస్తారని వ్యాపారుల్లో ప్రచారం కూడా టెండర్లు దాఖలు కాకపోవటానికి కారణంగా చెబుతున్నారు. నాలుగు దరఖాస్తులు తప్పని సరి నిబంధనను తొలగిస్తారని, అదనపు పన్ను మినహాయింపు వస్తుందని వారు వ్యాపారులు వేచి చూస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం పాలసీలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టంచేస్తున్నారు. ఇదే సమయంలో చివరి రెండు రోజుల్లో టెండర్లు పెద్ద సంఖ్యలో దాఖలు అయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. దీంతో, చివరి రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications