లోకేష్ వార్డు కౌన్సిలర్‌గా గెలువు ముందు.. ఆపై జగన్ గురించి మాట్లాడు: ఎమ్మెల్యే పిన్నెల్లి
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైన, నారా లోకేష్ పైన వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు, నారా లోకేష్ ల తోకలు కట్ చేస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని సమస్య వచ్చిందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు.
నారా లోకేష్ వార్డ్ కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత 151అసెంబ్లీ సీట్లు గెలిచిన సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేయాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి లోకేష్ ను టార్గెట్ చేసి సెటైర్లు వేశారు. లోకేష్ కు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సిబిఐ విచారణ మేరకు దోషులకు శిక్ష పడుతుందని పేర్కొన్నారు. దీనిపై అనవసరంగా రాజకీయం చేయడం తగదన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మంచి మార్పులు చోటు చేసుకున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీటీడీలో పైరవీలకు చెక్ పడిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయాలు సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిచ్చేలా సాగుతున్నాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశంసలు గుప్పించారు. ఎవరో కొంతమందికి అసౌకర్యం కలిగినంత మాత్రాన టిటిడిపై విమర్శలు చేయడం మంచిది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి నిర్ణయాలతో అటు సామాన్య భక్తులు, ఇటు విఐపి లు కూడా ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో పల్నాడు జిల్లాలో ఏడుకి ఏడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పల్నాడు రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications