టీడీపీలో చేరిపోయిన బొత్స మేనల్లుడు..! చంద్రబాబు కీలక హామీ?
విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు కూడా అయిన మజ్జి శ్రీనివాసరావు (Majji SrinivasaRao) ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గంటల వ్యవధిలోనే అమరావతికి చేరుకుని సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పేసుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో చేరారు. వీరిద్దరికీ చంద్రబాబు కీలక హామీలు ఇచ్చినట్లు సమాచారం.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బొత్స మేనల్లుడు చిన్న శ్రీను వ్యక్తిగత కారణాలను చూపుతూ వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పేశారు. మేనమామ బొత్స సత్యనారాయణతో విభేదాల కారణంగానే ఆయన పార్టీని వీడినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతుండగా.. ఇవాళ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరిపోయారు. దీంతో పార్టీ కండువా కప్పి చిన్న శ్రీనును టీడీపీలోకి సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.

రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో చిన్న శ్రీను టీడీపీలో చేరారు. టీడీపీలో చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర, ఆమె అనుచరులు కూడా చేరారు. వీరి చేరికతో విజయనగరం జిల్లాలో టీడీపీ బలపడినట్లయింది. ఇన్నాళ్లూ బొత్స అండతో రాజకీయాలు చేసిన చిన్న శ్రీను ఇప్పుడు టీడీపీ నేతలతో కలిసి జిల్లాలో చక్రం తిప్పబోతున్నారు. బొత్స కుమార్తె రాజకీయాల్లో ఆయన వారసురాలిగా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో చిన్న శ్రీను ఇలా పార్టీ మారడం ప్రాధాన్యం సంతరించుకుంది.













Click it and Unblock the Notifications
