తిరుమలలో మళ్లీ దంచికొట్టిన వర్షం: ఏపీలో ఈ అయిదు జిల్లాల్లో..
అమరావతి: ఏపీకి ఇవ్వాళ కూడా వరుణుడు పలకరించాడు. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని అమరావతిలోని భారత వాతావరణం కేంద్రం అంచనా వేసింది.
ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతం నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా సదరన్ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఆయా రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈదురు గాలులు వీస్తాయని, పిడుగుల పడే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది.

దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల ఇవ్వాళ భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో వర్షం దంచికొట్టింది. రెండు రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో వర్షం కురవడం ఇది రెండోసారి. శుక్రవారం వడగండ్ల వాన పడిన విషయం తెలిసిందే. ఉదయం వరకు భక్తులను ఇబ్బందులకు గురి చేసిన ఎండ తీవ్రత మధ్యాహ్నానికి తగ్గింది. ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.
దీనితో భక్తులు ఇబ్బందులకు గురి అయ్యారు. ఆలయం నాలుగు మాడ వీధుల్లో వర్షపు నీరు నిలిచింది. ఆలయం ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కోస్తా జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసిందివ్వాళ. కోనసీమ జిల్లాలోని పోలవరం, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
విజయవాడ సిటీతో పాటు గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఈ రాత్రిలోగా ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అటు విశాఖపట్నం జిల్లాలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తోన్నారు. 40 నుంచి 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతతో ఇక్కట్లు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఊరట కలిగించేదే.












Click it and Unblock the Notifications