85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం
కడప జిల్లా ఒంటిమిట్టలో వెలిసిన చారిత్రాత్మక శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు ఆదివారం శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై ఊరేగారు. అశేష భక్తజనావళికి అభయమిచ్చారు. సాయంత్రం 7 గంటలకు ఈ సింహవాహనోత్సవం ఆరంభమైంది. సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అత్యంత శక్తిమంతమైనది కూడా. అందుకే వైష్ణవాలయాల్లో నిర్వహించే అన్ని బ్రహ్మోత్సవాల్లో కూడా సింహవాహనానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

వాహనసేవల్లో సింహం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. యోగశాస్త్రంలో సింహం బలానికి (వహనశక్తి), వేగానికి (శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.
రేపు ఒంటిమిట్టలో శ్రీ సీతా రాముల కల్యాణోత్సవం జరుగనుంది. వేలాదిమంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టింది. కల్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు అందించడానికి 85,000 తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధం అయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్- 1లో శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ను ఆదివారం టీటీడీ నిర్వహించింది. ఈ లడ్డూల ప్యాకింగ్ కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
తిరుమల ఎస్టేట్స్ అధికారి, డిప్యూటీ ఈవో (పరకామణి ఇన్‌ఛార్జ్) వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిరంతరాయంగా సాగింది. ఈ సందర్భంగా డిప్యూటీ ఈఓ మాట్లాడారు. లడ్డూల ప్యాకింగ్, లోడింగ్, రవాణా వంటి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు.












Click it and Unblock the Notifications