ఏపీలో మరో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం !!
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ( 2 డిసెంబర్, 2025 ) తెల్లవారుజామున నర్సీపట్నం పట్టణంలోని శారదానగర్‌లో పోస్టాఫీసు ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ లో ఈ ఘటన జరిగింది. ఆకస్మికంగా మంటలు చెలరేగగా భారీ నష్టం వాటిల్లిందని షాప్స్ యాజమానులు వాపోతున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కాగా ప్రాథమిక సమాచార ప్రకారం మేరకు.. భవనం మొదటి అంతస్తులో ముందుగా మంటలు కనిపించాయని అంటున్నారు. కొద్ది నిమిషాల్లోనే అవి వేగంగా వ్యాపించి భవనం మొత్తం పొగ కమ్ముకుందని స్థానికులు తెలిపారు. మంటలు అత్యంత వేగంగా వ్యాపించడం వల్ల అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, వ్యాపార సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయని వెల్లడించారు. భారీ ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనపై స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో.. సదరు సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. పొగ దట్టంగా ఉండడంతో.. సుమారు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట నిస్తుంది. భవనంలో నివసించే కుటుంబాలు, అక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు తమ ఆస్తులు పూర్తిగా కాలిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. అత్యవసర పత్రాలు, నగదు, విలువైన వస్తువులను సైతం రక్షించుకోలేకపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదానికి విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి కారణాలను నిర్ధారించేందుకు ఫైర్ శాఖ, పోలీసులు కలిసి దర్యాప్తు ప్రారంభించారు. భవనంలో ఫైర‍్ సేఫ్టీ చర్యలు సరిగా ఉన్నాయా? ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు అమల్లో ఉన్నాయా? అనే అంశాలపై కూడా విచారణ సాగుతోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలగజేస్తున్నాయి. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు వరుసగా ఉన్న బొమ్మల దుకాణాలు మంటల్లో దగ్ధమయ్యాయి. శనివారం అర్ధరాత్రి ఘటన జరగగా భారీ ఆస్తినష్టం జరిగినట్టు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications