రైలు ప్రమాదంలో ఏపీ ప్రయాణీకులపై మంత్రి అమర్నాధ్ కీలక ప్రకటన..!!
ఒడిశా రైలు ప్రమాదంలో రిజర్వ్ చేసుకోకుండా ప్రయాణం చేసిన వారు, ఆచూకి లేరని కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్ చేస్తే సాయం అందించటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి గుడివాడ అమర్ నాధ్ స్పష్టం చేసారు. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులతో కలిసి ఘటనా స్థలికి వెళ్లామని చెప్పారు. ఏపీకి చెందిన ఒక వ్యక్తి మరణించినట్లు గుర్తించామన్నారు. విశాఖ ఆస్పత్రుల్లో 9 మందికి చికిత్స జరుతుందని వివరించారు.
ఒడిశాలో ఏపీ టీం:కోరమండల్‌లో 309 మంది, యశ్వంత్‌పూర్ రైలులో 33 మంది ఏపీకి చెందిన వారు ఉన్నారని, రెండు రైళ్లలో 342 మంది ప్రయాణించినట్లు గుర్తించామన్నారు.వీరిలో 12 మందికి స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. విశాఖ ఆసుపత్రిలో నలుగురికి చికిత్సలు అందిస్తున్నామని, గురుమూర్తి అనే వ్యక్తి తప్ప ఎవరూ మరణించలేదని, అందరూ క్షేమంగానే ఉన్నారని మంత్రి తెలిపారు.

రైలు ప్రమాదంపై ఇతర రాష్ట్రాల కంటే చొరవగా ఏపీ ప్రభుత్వం పని చేసిందన్నారు. ఈ ప్రమాదాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం సరికాదని హితవు పలికారు. రైల్వే డిపార్టుమెంట్ కేంద్రం పరిధిలో ఉంటుందని, బాధిత కుటుంబాలకు పరిహారం ఎంత ఇవ్వాలన్నది వారి పరిధిలోనే ఉంటుందన్నారు.
అండగా నిలుస్తున్నాం:రాష్ట్రానికి సంబంధించి సీఎం వైయస్ జగన్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. అన్ రిజర్వ్ కంపార్టుమెంట్లలో ప్రయాణం చేసిన వారి గురించి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 276 మంది మరణించినట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని వివరించారు.
187 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఏపీకి చెందిన ముగ్గురు ఐఏఎస్ లు ఇంకా భువనేశ్వర్‌లో ఉన్నారని వెల్లడించారు. రిజర్వ్ చేసుకోకుండా ప్రయాణం చేసిన వారు, ఆచూకి లేరని కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్ చేస్తే సహాయం అందించటానికి ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఒడిస్సా బాలాసోర్ వెళ్లి రైలు ప్రమాదంలో గాయపడిన ఏపీకి చెందిన వారిని పరామర్శించటం జరిగింది pic.twitter.com/3IB3FE3hjq
— Gudivada Amarnath (@gudivadaamar) June 3, 2023
ప్రభుత్వాన్ని సంప్రదించండి:అంబటి రాములు అనే వ్యక్తి కనిపించటం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేశారని మంత్రి వెల్లడించారు. అంబటి రాములు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, ఏపీలో వాచ్‌మాన్ గా పని చేస్తున్నారని చెప్పారు. ఏపీకి చెందిన ఒక వ్యక్తి గురుమూర్తి మాత్రమే చనిపోయారని పేర్కొన్నారు.
బాధితుడి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు, ప్రస్తుతం ఒడిశాలోని వివిధ ఆస్పత్రుల్లో 72 గంటల పాటు మార్చురీల్లో మృతదేహాలను ఉంచనున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు చెప్పారని వివరించారు. ఆ తర్వాత సామూహిక ఖననాలు చేస్తారన్నారు. ఏపీకి చెందిన గ్రౌండ్ సిబ్బంది, అధికారులు ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారని మంత్రి అమర్నాధ్ వివరించారు.












Click it and Unblock the Notifications