చంద్రబాబు దొరికిపోయారు, ఇక జరిగేదిదే - మంత్రి అమర్నాధ్..!!
తన పైన వచ్చిన ఆరోపణలకు చంద్రబాబుకు సమాధానం చెప్పాలని మంత్రి అమర్నాధ్ డిమాండ్ చేసారు. ప్రజలకు నీతులు చెప్పే చంద్రబాబు.. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలన్నారు. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఐటీ నోటీసుల ద్వారా స్పష్టమవుతోందన్నారు. చంద్ర బాబు స్కిల్డ్ క్రిమినల్..అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అని మంత్రి ఆరోపించారు. పొంతన లేని వ్యాఖ్యలతో దాటవేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నారావారిపల్లి నుంచి జూబ్లీహిల్స్ భవంతి వరకు అవినీతి పునాదులు మీద నిర్మించారని మంత్రి అమర్నాధ్ ఆరోపించారు. చంద్రబాబు ఒక బ్యాక్ డోర్ పొలిటీషియన్ అని దుయ్యబట్టారు. చంద్రబాబును ప్రజా కోర్టులోకి ఈడుస్తాం.. అక్కడ సమాధానం చెప్పాలి.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ శిక్ష అనుభవించక తప్పదు అని హెచ్చరించారు. రూ.118 కోట్లు లంచం తీసుకున్నారని ఆదాయపన్ను శాఖ చెబుతుంటే చంద్రబాబు ఎందుకు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. అన్నా హజారే అనుచరుడు.. గాంధీజీ తమ్ముణ్ణి అని చెప్పుకునే చంద్రబాబు.. తనపై లంచగొండి ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

సీమెన్స్ అనే సంస్థలో ఓ వ్యక్తి ద్వారా రూ. 3,356 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పి ప్రభుత్వ వాటా రూ. 350 కోట్లు మళ్లించారని మంత్రి వివరించారు. యూరో లాటరీ మాదిరిగా సీమెన్స్ పేరిట మోసం చేశారని ఆరోపించారు. ఈ 350 కోట్లు అత్యవసర క్యాబినెట్ ద్వారా మళ్లించారన్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ ..అమరావతి పేరిట ఎన్నో అవినీతికి పాల్పడ్డారని మండిప్డారు. చంద్రబాబు ప్రజా కోర్టులో సమాధానం చెప్పాలి.. అవినీతి బాబు కథ విచారణకు ఈడీ జోక్యం చేసుకోవాలి అని మంత్రి అమర్నాథ్ కోరారు. చంద్రబాబు వ్యవహారంలో తీగ బయటకు వచ్చిందని..ఇక డొంక కదలాలని అమర్నాధ్ చెప్పుకొచ్చారు. ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టిన విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని చెప్పుకొచ్చారు.
ఐటీ శాఖ 46 పేజీలు షోకాజ్ నోటీసు ఇస్తే.. తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించారన్నారు. నోటీసులు వచ్చిన ప్రతీసారీ పొంతన లేని లేఖలు రాసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2020 నుంచి జూన్ వరకు నాలుగు నోటీసులు ఇచ్చారు...సంబంధం లేని వివరణ ఇస్తారని చెప్పుకొచ్చారు. సీమెన్స్ వంటి కంపెనీని స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ లోకి లాగిన ఘనుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. స్కిల్ డవలప్ మెంట్.. అమరావతి భూములు.. ఇలా ఎక్కడ చూసిన అవినీతికి పాల్పడి.. ఎందుకు నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో వాటాదారులు శిక్ష అనుభవించక తప్పదని మంత్రి అమర్నాధ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications