వైసీపీ గెలిచే సీట్లపై మంత్రి బొత్సా క్లారిటీ...!!
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అటు టిడిపి కూటమి అధికారం తమదేనని చెబుతోంది. ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని పార్టీ నేతలు ప్రకటించారు. ఇదే సమయంలో పార్టీ గెలిచే స్థానాలపైన సీనియర్ మంత్రి బొత్సా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మాదే అధికారం
ఈసారి ఎన్నికల్లో వైసీపీ గెలిచి మరోసారి అధికారం దక్కించుకుంటుందని మంత్రి బొత్సా చెప్పుకొచ్చారు. 175 సీట్లకు దగ్గరగా గెలవబోతున్నామని వివరించారు. జూన్ 9న విశాఖలోని సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం జరుగుతుందన్నారు. రాజకీయ నాయకునిగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రావాలని కోరుకోవలసి ఉంటుందని... కానీ, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తమ పార్టీ సీట్లు అవసరం ఉండేలా కేంద్రంలో అధికారం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. వైసిపికి ఉత్తరాంధ్రలో 34 సీట్లు వస్తాయని బొత్సా జోస్యం చెప్పారు.

అందుకే జరిగాయి
ఎన్నికల కమిషన్ నియమించిన రిటైర్డ్ పోలీస్ అధికారి ఏకపక్ష నిర్ణయంపై తాము గవర్నర్ ను కలిసినట్లు బొత్స వెల్లడించారు. అధికారి మార్పులో జాగ్రత్తలు పాటించకపోవడం వలన కొన్ని ఘటనలు జరిగాయని వివరించారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఏ ప్రాంతంలో అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయని చెప్పుకొచ్చారు. తొందరపాటు నియామకాల వలన హింసాత్మక సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అధికారులను నియమించే సమయంలో వారి పూర్వపరాలు తెలుసుకోవాలని అభిప్రాయపడ్డారు.
విశాఖ నుంచే పాలన
రాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారని బొత్స మండిపడ్డారు. హింసాత్మక ఘటనలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా తమపై నిందలు వేయటం సరికాదన్నారు. హింసకాండ కు వైసిపి పూర్తి వ్యతిరేకమని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని సూచించారు. ఫలితాలపై టిడిపి డీలా పడిందని.. అందుకే మహానాడు వాయిదా వేసుకున్నారని బొత్సా వ్యాఖ్యానించారు. విశాఖ కేంద్రంగా జగన్ పాలన ప్రారంభిస్తున్న దశలో నగర ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications