విశాఖకు ముఖ్యమంత్రి షిఫ్టింగ్ - మంత్రి అమర్నాధ్ క్లారిటీ...!!
ముఖ్యమంత్రి జగన్ విశాఖకు షిప్టింగ్..పరిపాలన ప్రారంభంపై మంత్రి అమర్నాధ్ స్పష్టత ఇచ్చారు.
ఏపీలో మూడు రాజధానుల వివాదం కొనసాగుతోంది. మంత్రి బుగ్గన విశాఖ రాజధాని పైన చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా రాజకీయ కలకలం మొదలైంది. బుగ్గన వ్యాఖ్యల పైన మంత్రులు..అధికార పార్టీ నేతలు వరుసగా వివరణ ఇచ్చారు. మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. ఈ నెల 23న సుప్రీంకోర్టులో రాజధాని కేసు విచారణకు రానుంది. ఆ తరువాతనే ప్రభుత్వం మూడు రాజధానుల వ్యవహారం పైన కార్యాచరణ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ విశాఖకు షిప్టింగ్ ఉంటుందా ఉండదా అనే చర్చ మొదలైంది. దీని పైన మంత్రి గుడివాడ అమర్నాధ్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఆలోచన ఏంటనేది స్పష్టం చేసారు.
విశాఖపట్నం దేశంలోని టాప్ సిటీస్‌లో ఒకటిగా నిలిచిందని మంత్రి అమర్నాధ్ వెల్లడించారు. ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందే నగరాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. రాబోయే రెండు నెలల కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు విశాఖకు రాబోతున్నాయని..ఇన్ఫోసిస్ కూడా ఏర్పాటవుతుందని చెప్పుకొచ్చారు. పరిశ్రమలు స్థాపించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ విశాఖలో ఉన్నాయని వివరించారు. ఇదే సమయంలో విశాఖపట్నం రాజధాని కాబోతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతున్నారని మంత్రి అమర్నాధ్ స్పష్టం చేసారు.

ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని చెప్పారు. త్వరలో భోగాపురం వద్ద ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్లోబల్ టెక్ సమ్మిట్‌లో ఆధునిక టెక్నాలజీ ఆవిష్కరణతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాలపై చర్చ నిర్వహిస్తున్నారు. జి-20 దేశాలతో పాటు మరో 25 దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు, 300 వరకు ఐటీ కంపెనీలు పాల్గొన్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎలా అనుసరించాలి, వ్యవసాయ ఉత్పత్తులను ఎలా ఎగుమతి చెయ్యాలి, అవసరమైన నాణ్యతా ప్రమాణాలపై చర్చ జరుగుతుందని వివరించారు. మరో మంత్రి బొత్సా ఇదే అంశం పై స్పందించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. లోకేష్ పాదయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications