ఏపీ పాలనపై మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు; మంత్రి కారుమూరి కౌంటర్!!
టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఏపీలో జరిగిన అభివృద్ధిని, తెలంగాణలో జరిగిన అభివృద్ధితో అనుక్షణం పోలుస్తున్న పరిస్థితులు రెండు రాష్ట్రాల మధ్య ఆసక్తికర పరిణామాలకు కారణంగా మారాయి.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులు తెలంగాణ అభివృద్ధిని, ఏపీ అభివృద్ధితో పోల్చి చూపి కెసిఆర్ పాలనకు కితాబిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీలోని ప్రజలకు ఇదే విషయాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మంత్రి హరీష్ రావు ఏపీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలే అని పేర్కొన్న ఆయన ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు.

ఏపీ, తెలంగాణ రెండు ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసిన మీరు అక్కడ రోడ్లు, ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందో చూసే ఉంటారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఏపీ కంటే చాలా బెటర్ అని అందుకే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోనే ఓటు నమోదు చేసుకోవాలంటూ హరీష్ రావు పిలుపునిచ్చారు. ఏపీ పాలనకు, తెలంగాణ పాలనకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది అంటూ జగన్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. అంతేకాదు ఏపీలో కేంద్రం నుండి నిధుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి ప్రజలకు అన్యాయం చేశారనే భావన వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.
ఇక దీంతో ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రులు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు ఒకసారి ఏపీలోకి తొంగి చూస్తే వైసీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధి కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో రోడ్లు సరిగా లేవని మంత్రి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు. ఏపీ ప్రజలు మళ్ళీ సీఎం జగనే రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications