మంత్రి పల్లెను రౌండప్ చేసిన సీపీఎం.. భయంతో రోడ్డు వెంబడి పరుగులు
అనంతపురం : ఏపీ సమాచార శాఖ, పౌర సంబధాల మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి సీపీఎం సెగ తగిలినట్లుగా తెలుస్తోంది. తన ఇంటికి సమీపంలోనే సీపీఎం నేత గేయానంద్ చేపట్టిన దీక్షను ఏమాత్రం పట్టించుకోని మంత్రి వైఖరిని నిరసిస్తూ.. సీపీఎం కార్యకర్తలు ఆయన్ను రౌండప్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. అనంతపురం ప్రభుత్వ బోధనాసుపత్రిలో పడకల పెంపు, సిబ్బంది నియమాకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా సీపీఎం ఎమ్మెల్సీ గేయానంద్ దీక్ష చేస్తున్నారు. దీక్ష మూడో రోజు సందర్బంగా.. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహానం దీక్షా ప్రాంగణం ముందు నుంచే వెళుతుండడం సీపీఎం కార్యకర్తల కంటపడింది.

దీంతో పల్లె కారుకు అడ్డుపడ్డ సీపీఎం నేతలు ఆయన కారు దిగిన వెంటనే వాగ్వాదానికి దిగారు. మూడు రోజులుగా దీక్ష చేస్తున్నా.. పట్టించుకోవడం లేదంటూ కార్యకర్తలు గట్టిగా నిలదీయడంతో.. సరే ఇప్పుడు పలకరిస్తానంటూ ముందుకు కదిలారట మంత్రి పల్లె. మూడు రోజులుగా పట్టించుకోని మంత్రి గారు ఇప్పుడేదో తాము నిలదీయడంతో.. నామమాత్రానికి పలకరింపులకు దిగుతున్నారంటూ ఆగ్రహించిన సీపీఎం కార్యకర్తలు పల్లెను రౌండప్ చేశారట.
పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన మంత్రి పల్లె.. అక్కడివాళ్లను తప్పించుకుని కొద్ది దూరం పరిగిత్తే ప్రయత్నం చేయగా.. మధ్యలోనే ఆయన కాలికున్న చెప్పు డివైడర్ మధ్యలో ఇరుక్కుపోయిందట. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీపీఎం ఆందోళనకారులను అదుపు చేసి.. హుటాహుటిన వేరే కారులో ఆయన్ను టీడీపీ పార్టీ కార్యాలయానికి తరలించినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications