పెద్దిరెడ్డికి పరువు ప్రతిష్ట, ఆ నియోజక వర్గంలో డబుల్ ఢమాకా?, కొడుకు, తమ్ముడి కోసం ప్లాన్!
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతున్నది, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి విజయం మాదే అని ధీమాగా చెబుతోంది. ఇక ప్రధాన ప్రతిక్ష పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి మహాకూటమిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్దం అవుతున్నాయి. వైసీపీకి కొన్ని నియోజక వర్గాల్లో ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని తెలిసింది.
ఇంతకాలం సైలెంట్ గా ఉంటున్న ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు ? అని కచ్చితంగా చెప్పడం ఇప్పుడే సాధ్యం కావడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న తంబళ్లపల్లే నియోజక వర్గం తరువాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. గతంలో తంబళ్లపల్లే అంటే టక్కున చెప్పే పేర్లే తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఏవీ లక్ష్మిదేవమ్మ, కాంగ్రెస్ లీడర్ కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీకి చెందిన చర్లపల్లి నరసింహారెడ్డి.

తరువాత రానురాను సీన్ మారిపోయింది, లక్ష్మీదేవమ్మ కుమారుడు ఏవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరి తంబళ్లపల్లె ఎమ్మెల్యే అయ్యారు, తరువాత చంద్రబాబు సీఎం అయిన తరువాత వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కొంతకాలం బాగానే ఉన్నారు. ఇదే సమయంలో తంబళ్లపల్లెలో తెలుగుదేశంలో చేరిన బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకర్ యాదవ్ ఆయనకంటూ అనుచర వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోవడంతో ఆ దెబ్బతో తంబళ్లపల్లెను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆయన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా సొంత తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిని గెలిపించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తరువాత చక్రం తిప్పారు. పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారక నాథ రెడ్డి ఆ నియోజక వర్గాలను కంచుకోటలుగా మలుచుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన శంకర్ యాదవ్ ను ఈసారి పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు జయచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చారు.
తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజక వర్గంలో బలిజ, రెడ్డి సమాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ నాన్ లోకల్ అని, వారి అరచాకాలు ఎక్కువ అయ్యాయని, రైతు బిడ్డ జయచంద్రా రెడ్డిని గెలిపించాలని రెడ్డి సామాజిక వర్గంతోనే ప్రచారం చేయించాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు. జయచంద్రా రెడ్డికి తంబళ్లపల్లె జనసేన పార్టీ నాయకులు కూడా మద్దతు ప్రకటించడంతో ఆ నియోజక వర్గంలో రానురాను సీన్ మారుతోంది.
శంకర్ యాదవ్ కు నచ్చచెప్పి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నీకు మంచి నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు ఆయనకు హామీ ఇచ్చారని తెలిసింది. ఇక మైనారిటీ ఓటు బ్యాంకు చీలిపోకుండా చూసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తంబళ్లపల్లె వైసీపీ నాయకులకు సూచించారని తెలిసింది. తంబళ్లపల్లెలో తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డికి ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

అదే సమయంలో రాజంపేట లోక్ సభ నియోజక వర్గంలో కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి భారీ మెజారిటీ రావాలంటే ఆ నియోజక వర్గం పరిధిలోని తంబళ్లపల్లెలో కూడా తమ్ముడు ద్వారకరనాథ రెడ్డికి ఎక్కువ మెజారీ ఓట్లు పడేలా చూడాలని బావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తంబళ్లపల్లె నియోజక వర్గం మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారని తెలిసింది. అయితే తంబళ్లపల్లెలో గతంలో జరిగిన భూలావాదేవీల వ్వహారాలు, కొన్ని కాంట్రాక్టు పనుల వ్యవహారాలు, జడ్డి మీద దాడి లాంటి సంఘటనలతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద ఓటర్లు గుర్రుగా ఉన్నారని తెలిసింది.
వ్యతిరేకత ఉన్న ఊర్లలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అప్పుడే బుజ్జగింపులు మొదలుపెట్టారని స్థానిక ఓటర్లు అంటున్నారు. అదే విధంగా తంబళ్లపల్లెలో తెలుగుదేశం, జనసేన ఓట్లు పక్కదారి పట్టకుండా, ఓట్లు చీలిపోకుండా చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు, జనసేన నాయకులు పక్కాప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజక వర్గం మీద గతంలో కంటే ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్ది, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎక్కువ ఫోకస్ పెట్టారని తెలిసింది.












Click it and Unblock the Notifications