నా సస్పెన్షన్ వెనుక ఆ ఇద్దరు ? మంత్రితో కుమ్మక్కు ! దువ్వాడ మరో ట్విస్ట్..!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. తనను సస్పెండ్ చేసిన వైసీపీతో పాటు టీడీపీలోనూ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు మద్దతుగా, మంత్రి అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా గళం విప్పిన దువ్వాడ.. ఇప్పుడు సొంత పార్టీలో వెన్నుపోటుదారులను టార్గెట్ చేస్తున్నారు.
కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను కూన రవికుమార్ వేధించినట్లు వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే స్పందించిన దువ్వాడ శ్రీనివాస్ .. ఆయన్ను మంత్రి కానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు పన్నుతున్న కుట్రగా అభివర్ణించారు. వైసీపీలో ధర్మాన సోదరులు ప్రసాదరావు, కృష్ణదాస్ తో కుమ్మక్కై మంత్రి అచ్చెన్నాయుడు ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఈ చిచ్చు ఆరకముందే దువ్వాడ మరో బాంబు పేల్చారు.

తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అచ్చెన్నాయుడుతో కుమ్మక్కై ధర్మాన సోదరులు వైసీపీ నుంచి తనను సస్పెండ్ చేయించారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ నుంచి తన సస్పెన్షన్ తాత్కాలికమేనని ఆయన తెలిపారు. దీనికీ పార్టీ అధినేత జగన్ కూ ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఎప్పటికీ జగన్ విధేయుడిగానే ఉంటానని దువ్వాడ చెప్పుకొచ్చారు. అయితే తన సస్పెన్షన్ వెనుక ఉన్నది మాత్రం ధర్మాన సోదరులే అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో తన ధాటికి తట్టుకోలేక ధర్మాన సోదరులు ప్రసాదరావు, కృష్ణదాస్.. మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబంతో ఉన్న లోపాయికారీ ఒప్పందాలతో కుట్ర పూరితంగా తనను సస్పెండ్ చేయించారని, వారికి చేతనైతే తనను పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. అదే సమయంలో అచ్చెన్నాయుడుతో పాటు ఆయన అన్న కుమారుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపైనా దువ్వాడ విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నారని, క్యాప్టివ్ మైనింగ్ పై మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు.












Click it and Unblock the Notifications