కాకినాడలో అర్ధరాత్రి ఎమ్మెల్సీ కారు బీభత్సం: ముగ్గురికి గాయాలు
కాకినాడ: గతంలో డ్రైంకన్ డ్రైవ్ కేసులు కేవలం హైదరాబాద్‌కే పరిమితమయ్యేవి. కానీ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో జల్సాలకు అలవాటు పడ్డ రాజకీయ నాయకుల పుత్రరత్నాలు తమ సొంతూళ్లలోనూ ఇలాంటి ఘనకార్యాలు చేస్తున్నారు.
తాజాగా ఈ తరహా ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం రాత్రి అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కాకినాడ వార్ఫు రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి స్థానిక ఎమ్మెల్సీకి చెందిన కారు ఒకటి బీభత్సం సృష్టించింది.

కాకినాడకు చెందిన ఓ ఎమ్మెల్సీ పుత్రరత్నం పుల్లుగా మద్యం సేవించి కారెక్కాడు. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన అతడు కారు నడిపాడు. వేగంగా దూసుకొచ్చిన ఈ కారు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న మరో రెండు కార్లను ఢీ కొట్టడమేకాకుండా రెండు ఆవులను సైతం గాయపర్చింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆ కారును తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారిదిగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్సీ లోగో ఉన్న వాహనాన్ని ఆమె కుమారుడు ప్రవీణ్ వేగంగా నడపటంవల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రవీణ్ అతిగా మద్యం సేవించడం వల్ల వాహనం నడిపినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications