ఆంధ్రాలో డైరెక్ట్ సెల్లింగ్: మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలకు ఇవీ నిబంధనలు..
అమరావతి: రాష్ట్రంలో డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల కోసం ఎపి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదలచేసింది. ఇటీవలి కాలంలో ఈ తరహా సంస్థలు ఎక్కువైపోవడంతో ఎపి ప్రభుత్వం ఈ సంస్థల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది.ఈ సంస్థలు ఎలాంటి లైసెన్స్లులు తీసుకోవాలి...సిబ్బంది జీతభత్యాలు తదిదర అంశాల మీద ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
వస్తు విక్రయాలు జరపడం కోసం ప్రత్యేకించి షాపు, కేరాఫ్ అడ్రెస్ లేకుండా ప్రొడక్ట్ లను నేరుగా విక్రయించేడైరెక్ట్ సెల్లింగ్ వ్యాపార సంస్థల కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. తద్వారా ఆ తరహా అమ్మకాలను నియంత్రించదలిచింది. ఈ మధ్య కాలంలో ఇటువంటి సంస్థలు పుట్టగొడుగుల్లా పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ సెల్లింగ్,మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యాపారం వల్ల వినియోగదారులు నష్టపోకూడదనే కేంద్ర ప్రభుత్వం సూచనలపై స్పందించి ఎపి ప్రభుత్వం ఈ మార్గదర్శకాలువిడుదలచేసింది.

ముందు మేల్కొన్న కేంద్రం...
ఈ తరహా కంపెనీలను నియంత్రించేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఈ తరహా వ్యాపారాలను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్రాలకు సూచిస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కేంద్రం డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల కోసం రూపొందించిన వాటిని మాదిరిగా తీసుకొని కొత్త మార్గదర్శకాలు సిద్దంచేసింది.

ఉత్తర్వులు విడుదల...
డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల కోసం రూపొందించిన మార్గదర్శకాలకు సంబంధించి శుక్రవారం ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ముందుగా ఈ తరహా సంస్థలు పరిశ్రమల శాఖ కమిషనర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకొని అనుమతి పత్రం పొందాల్సిందేనని ఎపి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఇప్పటివరకు ఈ విధమైన సంస్థలకు ఎలాంటి లైసెన్స్ అక్కరలేదని భావిస్తున్న,వాదిస్తున్న వారికి ఈ ఉత్తర్వుల ద్వారా స్పష్టత ఇచ్చింది.

సభ్యుల కోసం...
ఈ విధమైన సంస్థల్లో పనిచేసేవారికి వారికి గౌరవ వేతనం ఇవ్వాలనే నిబంధనగానీ, ఖచ్చితంగా వస్తువులు కొనాలని కూడా నిర్భంధం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే సభ్యులు రిజిస్ర్టేషన్ ఫీజులు, ప్రవేశఫీజులు, వస్తువులకు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో వివరంగా తెలిపింది.

సంస్థ ఏం చెయ్యాలి....
ఈ తరహా డైరెక్ట్ సెల్లింగ్ , డైరెక్ట్ మార్కెటింగ్ సంస్థల్లో సభ్యులుగా చేరేవారికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఆ సంస్థలదేనని ఎపి ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అదేవిధంగా సంస్థ కార్యకలాపాల కోసం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో ఆదేశించింది.
ఎపి ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారానికి చట్టబద్దత ఏర్పడి ముందు ముందు ఈ విధమైన వ్యాపారం జోరందుకోవచ్చని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications