ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఈ 9 జిల్లాలకు భారీ వర్ష సూచన
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం ఏపీలో పెద్దగా కనిపించలేదు గానీ అల్పపీడనం వల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి.
నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుందని ఐఎండీ, ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలియజేశాయి. ప్రత్యేకించి- తొమ్మిది జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదువుతుందని అంచనా వేశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కావొచ్చు.

పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
ఇప్పటికే పలు జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెదురుమదురుగా వర్షం కురిసింది.
కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య రాయచోటి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కురిసిన భారీ వర్షానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సైతం వాయిదా పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications