మోడీ, బాబు అభివృద్ధి: వైయస్ అవినీతిపై పవన్
హైదరాబాద్: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రయం వ్యూహాత్మక ప్రచారం ఫలించినట్లే ఉంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని ఆధిక్యతను సాధించడం, బిజెపి చాలా కాలం తర్వాత కొన్ని స్థానాలను పొందడం అందుకు నిదర్శనం. పవన్ కళ్యాణ్ జత కూడడం ఆ రెండు పార్టీలకు కలిసి వచ్చింది. నరేంద్ర మోడీ గాలి చంద్రబాబుకు ఉపకరించింది.
గుజరాత్ తరహా అభివృద్ధి అనేది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఆ తరహా అభివృద్ధికి తానే ఆద్యుడనని చంద్రబాబు సీమాంధ్రలో చేసుకోవడం కూడా పనికి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్న సీమాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగించడంలో మోడీ, చంద్రబాబు విజయం సాధించారు. సైబరాబాద్ నిర్మాణానికి, హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబే కారణమని నమ్మే తెలుగు ప్రజలు అధిక సంఖ్యలోనే ఉన్నారు. విభజన తర్వాత తమకు అటువంటి అభివృద్ధి కావాలని సీమాంధ్ర ప్రజలు కోరుకున్నారు. దాన్ని సాధించపెట్టగలననే నమ్మకం చంద్రబాబు కలిగించారు.

చంద్రబాబుకు నరేంద్ర మోడీ తోడై అందుకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. గుజరాత్ అభివృద్ధిని విశ్వసించిన ప్రజలకు చంద్రబాబు, మోడీ జోడీపై నమ్మకం కుదిరిందని చెప్పాలి. వారిద్దరి వల్లనే అభివృద్ధి సాధ్యపడుతుందని పవన్ కళ్యాణ్ చెప్పడం అదనపు బలంగా మారింది. తాను పదవులు కోరుకోవడం లేదని, పరిస్థితి చూసి ఆగ్రహంతో ముందుకు వచ్చానని, అభివృద్ధి కోసమే తాను వారిని బలపరుస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై అపనమ్మకం ఏర్పడే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగిన దోపిడీ వల్లనే విసిగిపోయి తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైయస్ ప్రభుత్వ హయాంలో ఏ విధమైన అక్రమాలు, అన్యాయాలు జరిగాయో తన వ్యక్తిగత అనుభవం నుంచి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. జులం చేశారనే విషయాన్ని ఆయన నిక్కచ్చిగా చెప్పారు.
భూదందాలు పెరిగిపోయాయని, సెజ్‌ల పేరు మీద సామ్రాజ్యాలు నిర్మించుకున్నారని ఆయన చెప్పారు. జగన్ వస్తే అదే జరుగుతుందని నమ్మించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చెప్పారు. విశాఖఫట్నంలో బిజెపి అభ్యర్థి హరిబాబు కూడా అదే విషయం చెప్పారు. విశాఖపట్నంలో విజయమ్మను గెలిపిస్తే హైదరాబాద్‌ను చేసినట్లు చేస్తారని ఆయన అన్నారు. మొత్తం మీద, అభివృద్ధిని సాధించే త్రయంగా ఆ ముగ్గురు ముందుకు వచ్చారు.












Click it and Unblock the Notifications