భర్తలేని భార్య, జగన్ రావాలి: హైదరాబాద్‌పై మోదుగుల
న్యూఢిల్లీ: హైదరాబాదులేని రాష్ట్రం భర్తలేని భార్యవంటిదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి శనివారం అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ఎంపీలకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందు గొంతు ఎత్తే ధైర్యం లేదని విమర్శించారు.
ఈ రోజు సాయంత్రం జరిగే మంత్రుల బృందాన్ని(జివోఎం)ను తాము అడ్డుకుంటామన్నారు. జివోఎంను అడ్డుకునేందుకు కాంగ్రెసు, వైయస్ జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి రావాలన్నారు. జివోఎంకు ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లేనని ఆయన మండిపడ్డారు.

విభజన ద్వారా వచ్చే సమస్యలను పరిష్కరించాకనే ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్ర విభజనకు శాసన సభ తీర్మానం తప్పనిసరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాడుతుందన్నారు. సోనియా గాంధీ చెప్పినట్లే స్పీకర్ నడుచుకుంటారని, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో టిడిపి ఎంపీలు శనివారం సాయంత్ర 4 గంటలకు సమావేశం కానున్నారు. విభజన వల్ల వచ్చే నష్టాలపై ఈ సందర్భంగా ఎంపీలు షిండేకు నివేదికను సమర్పించనున్నారు. భేటీ అనంతరం హోంశాఖ ఎదుట టిడిపి ఎంపీలు ధర్నాకు దిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications