AP DSC 2024: డీఎస్సీ ఇప్పట్లో కష్టమేనా ? ఏపీ సర్కార్ టైం పాస్ వెనుక కారణమిదే ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మెగా డీఎస్సీ షెడ్యూల్, నోటిఫికేషన్ల ప్రకారం పరీక్షలు జరిగే లోపే ఎన్నికలు వచ్చేశాయి. అప్పట్లో 6 వేల పోస్టులతో ఇచ్చిన డీఎస్సీని దగా డీఎస్సీగా పేర్కొంటూ తాము అధికారంలోకి వస్తే అసలైన మెగా డీఎస్సీ ఇస్తామంటూ హామీలు ఇచ్చిన కూటమి నేతలు.. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్లోనే మెగా డీఎస్సీ ప్రతిపాదనను ఆమోదించడంతో పాటు 16 వేల పోస్టుల వరకూ భర్తీ చేస్తామంటూ ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు.
తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైన ప్రభుత్వానికి చివరి నిమిషంలో దళిత నేత మందకృష్ణ మాదిగ బ్రేక్ వేశారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు ఎలా భర్తీ చేస్తారంటూ సీఎం చంద్రబాబును కలిసి ఆయన ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను వాయిదా వేసేసింది. అయితే ఇది ఎప్పటివరకూ అన్న క్లారిటీ కూడా ఇప్పటికీ లేదు. దీనికి కారణం ఎస్సీ వర్గీకరణ అంత సులువు కాకపోవడమే.

ఈ మధ్యలో డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధుల నుంచి నియోజకవర్గాల్లో పెరుగుతున్న ఒత్తిడిని గమనించి సిలబస్ వెబ్ సైట్ లో విడుదల చేశామని ఓసారి, డీఎస్సీకి కులాల వారీగా ఉచిత కోచింగ్ ఇప్పిస్తామంటూ మరోసారి ప్రకటనలు చేస్తూ వస్తోంది. అంతే తప్ప డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో మాత్రం చెప్పలేని పరిస్ధితి. దీంతో ఇప్పటివరకూ వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిన పనికి తాము ఉద్యోగాలు లేకుండా పోయామని భావిస్తున్న వారు కాస్తా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడన్న ప్రశ్నకు వచ్చే ఏడాది మంటూ మండలిలో విద్యామంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. వచ్చే విద్యాసంవత్సరంలోపు టీచర్ల ఖాళీల్ని భర్తీ చేస్తామన్నారు. కానీ అదంత సులువు కాదని అర్దమవుతోంది. అసలే టీచర్లు విద్యాసంవత్సరం చివర్లో పరీక్షలతో బిజీగా ఉంటారు. ఆ తర్వాత పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనాలు, ఇలా ఎన్నో పనులుంటాయి. అలాంటి సమయంలో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తే వ్యతిరేకత తప్పదు. దీంతో డీఎస్సీ అభ్యర్ధుల పరిస్ధితి అగమ్య గోచరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications