ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఖరారు- వైసీపీకి పూర్తి మెజార్టీ : రద్దు చేయాలన్న చోటే..ఆధిపత్యం..!!
ఏపీ శాసన మండలిలో అధికార వైసీపీ పూర్తి మెజార్టీ సాధిస్తోంది. ఇప్పటికే శాసన సభలో 151 మంది సభ్యుల బలం ఉన్న వైసీపీకి టీడీపీ నుంచి అనధికారికంగా ముగ్గురు...జనసేన నుంచి ఒకరి మద్దతు ఉంది. ఇక, 58 మంది సభ్యులు ఉన్న శాసన మండలిలో వైసీపీ బలం 32కు చేరనుంది. ప్రస్తుతం శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలో మూడు..స్థానిక సంస్థల కోటాలో 11 సీట్ల భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో..ఈ 14 మంది నియామకానికి సంబంధించి వైసీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది.

శాసనమండలిలో వైసీపీ పూర్తి ఆధిపత్యం
అటు శాసనసభలో..స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 జిల్లాల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించటంతో ఈ 14 సీట్లు వైసీపీ ఖాతాలో జమ అవ్వటం లాంఛనమే. ఇక, ఈ నెల 18న ఏపీ అసెంబ్లీ - మండలి ఒక రోజు సమావేశం నిర్వహించనున్నాయి. తిరిగి, ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత డిసెంబర్ తొలి వారంలో శీతాకాల సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం యోచిస్తోంది. అదే సమావేశంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటుగా మండలికి కొత్త ఛైర్మన్.. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.

కొత్త ఛైర్మన్ - డిప్యూటీ ఛైర్మన్ దాదాపు ఖరారు
టీడీపీ హయాంలో ఛైర్మన్ గా పని చేసిన షరీఫ్.. డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం పదవీ విరమణ చేసారు. వారి స్థానంలో ఇప్పుడు వైసీపీ నుంచి కొత్త వారు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఇందు కోసం ముఖ్యమంత్రి జగన్ ఆ రెండు స్థానాల భర్తీకి కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. శాసనసభలో స్పీకర్ గా బీసీ వర్గానికి ఇవ్వటంతో..మండలి ఛైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
అందులో భాగంగా జగన్ పార్టీ ప్రకటన నుంచి మద్దతుగా నిలవటంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా ఉన్న పశ్చిమ గోదావరికి చెందిన కొయ్యే మోషేన్ రాజు పేరు ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఛైర్మన్ గా మోషేన్ రాజు.. డిప్యూటీగా బీసీ వర్గానికి
ఆయన రాజమండ్రి పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2014, 2019 లోనూ ఎమ్మెల్యే సీటు ఆశించినా .. దక్కకపోవటంతో ఆయనకు మండలి ఛైర్మన్ పదవి కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక, ఇదే సమయంలో టీడీపీ హయాంలో మైనార్టీకి ఛైర్మన్ గా అవకాశం ఇవ్వటంతో.. వైసీపీ ప్రభుత్వం సైతం మైనార్టీకి ఇస్తారనే మరో వాదన ఉంది.
ఇందు కోసం అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే.. ఇక్బాల్ 2019 ఎన్నికల్లో హిందూపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు.

తొలి సారిగా ఒకే పార్టీ నుంచి నలుగురు మైనార్టీ ఎమ్మెల్సీలు...
ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన తొలి టర్మ్ పూర్తి కాగానే..మరోసారి రెన్యువల్ చేసారు. ఇక, గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నుంచి శాసనమండలి నుంచి నలుగురు మైనార్టీలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. దీంతో..ఎస్సీ వర్గానికి మండలి ఛైర్మన్ పదవి కేటాయించి..డిప్యూటీ ఛైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం బీసీ మహిళా లేదా సీనియర్ నేత జంగా క్రిష్ణమూర్తికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జగన్ సీఎం అయిన సమయం నుంచి ప్రతీ ఎంపికలోనూ 50 శాతం ఎస్సీ..బీసీ..మైనార్టీ వర్గాలకు కేటాయిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఈ 14 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం తరువాత శాసన మండలిలో వైసీపీకి చెందిన 32 మంది సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 18 మంది ఉంటారు.

ఇక రెండు సభల్లోనూ వైసీపీ నిర్ణయాలే అమలు
చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే మినహా.. శాసన మండలి - డిప్యూటీ ఛైర్మన్లుగా వీరి పేర్లు అధికారికంగా ప్రకటించటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, మూడు రాజధానుల బిల్లుల వ్యవహారంలో మండలిలో ప్రతిపక్షం తమకు ఉన్న సంఖ్య బలం తో చక్రం తిప్పింది. దీంతో..మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇప్పుడు అదే మండలిలో ఇప్పుడు వైసీపీ పూర్తి ఆధిపత్యం సాధించి.. ఇక, రెండు సభల్లోనూ తిరుగు లేని ఆధిపత్యంతో నిర్ణయాలు తీసుకోనుంది.












Click it and Unblock the Notifications