బయట బ్రతకనివ్వరనే భయంతో.. మైనర్ కుమార్తెను ఓ తల్లి ఏం చేసిందంటే!
ఓ వైపు నిరంతరం పోలీసులు పని చేస్తూనే ఉంటున్నారు.. మరో వైపు కోర్టులు సైతం కఠిన శిక్షలను అమలు చేస్తోంది. కానీ సభ్య సమాజంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారానికి గురవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు దారుణాలకు ఒడిగడుతుండగా.. ఇప్పటికే ఎందరో బలయ్యారు. ఈ భయంతోనే ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన ఓ మహిళ.. తన మైనర్ కూతురు విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..
ఇచ్ఛాపురానికి చెందిన భాగ్యలక్ష్మికి ఒడిశాలోని కటక్‌కు చెందిన నరసింహరాజుతో 2007లో వివాహం జరిగింది. ప్రసవం కోసం ఇచ్ఛాపురం వచ్చిన భాగ్యలక్ష్మి అక్కడే ఉండిపోయింది. పదేళ్ల క్రితం భర్త మరణించడంతో ఆమె కుమార్తె మౌనిక (17)తో కలిసి జీవిస్తోంది. కాగా బాలిక తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. ఆ సమయంలోనే బాలిక పెద్దమనిషి అవ్వడంతో తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది.

బాలిక చదువు మాన్పించేసి ఇంటికే పరిమితం చేసింది భాగ్యలక్ష్మి. ఇరుగుపొరుగు వారు సైతం ఏమిటని ప్రశ్నించినా కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. దాంతో వారు జోక్యం చేసుకోవడం మానేశారు. ఆ తర్వాత ఆమె కుమార్తెను ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. అంతే కాకుండా ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసి, తల్లీకూతుళ్లు చీకట్లోనే ఉండేవారు. తల్లి పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. మౌనికను లోపల పెట్టి తాళం వేసేదని తెలుస్తోంది. తండ్రి లేకపోవడం, తల్లికి ఎదురు చెప్పలేకపోవడంతో మౌనిక రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటుంది.
అయితే ఈ విషయంపై స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త.. ఐసీడీఎస్ పీవో రాజేశ్వరికి ఫిర్యాదు చేశారు. రాజేశ్వరి ఈ విషయాన్ని ఇచ్ఛాపురం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పరేష్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి ఆదేశాలతో మండల తహసీల్దార్ ఎన్. వెంకటరావు, ఎంఈవో కె. అప్పారావు, పోలీసులు బాధిత బాలిక ఇంటికి వెళ్లారు. భాగ్యలక్ష్మికి నచ్చజెప్పి మౌనికను బయటకు తీసుకొచ్చారు. ఇద్దరినీ న్యాయస్థానానికి తీసుకెళ్లిన అధికారులు, బాలికకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భాగ్యలక్ష్మిని విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. మౌనికను శ్రీకాకుళం బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కొంత మంది భాగ్యలక్ష్మిని సమర్దిస్తుంటే.. మరి కొంతమంది మాత్రం అలా చేయడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications