ఫొటో: అసెంబ్లీలోకి సిఎం రమేష్, చెలరేగిన వివాదం
హైదరాబాద్: తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ శాసనసభలోకి ప్రవేశించడం వివాదాన్ని సృష్టించింది. విభజన బిల్లుపై ఓటింగు కోసం పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన సాగిస్తున్న సీమాంధ్ర తెలుగుదేశం సభ్యులతో మాట్లాడడానికి ఆయన బుధవారం సాయంత్రం సభలోకి ప్రవేశించారు. సీమాంధ్ర తెలుగుదేశం శాసనసభ్యులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. ఆ సమయంలో శాసనసభలోకి ప్రవేశించిన సిఎం రమేష్ ఫొటోలు బయటకు వచ్చాయి.
శాసనసభలోకి ప్రవేశించి ఆయన శాసనసభ్యుల మధ్య కూర్చున్నారు. ఈ విషయం బయటకు రావడంతో టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. అది తెలుసుకున్న ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. మీడియాతో కూడా ఆయన మాట్లాడలేదు. రమేష్ వ్యవహారంపై శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ స్పందించారు. సిఎం రమేష్ సభలోకి వచ్చి కూర్చున్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు. శాసనసభ్యులు కానివారు సభలోకి వెళ్లడం సరి కాదని ఆయన అన్నారు.

తమకు సంఘీభావం తెలపడానికి మాత్రమే పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ వచ్చారని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. పార్లమెంటులో రమేష్ సమైక్యవాణిని వినిపించారని ఆయన చెప్పారు. బిల్లుపై ఓటింగు జరుపుతామని స్పీకర్ హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన సాగుతుందని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు అంటున్నారు.
రేపు గురువారం తెలుగుదేశం నాయకులు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు సహకరించాలని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ కోరారు. ఆందోళన విరమించాలని శాసనసభ సచివాలయ కార్యదర్శి సదారాం కోరారని, తాము అందుకు అంగీకరించలేదని ఆయన చెప్పారు. రేపు బిల్లుపై ఓటింగుకు పట్టుపడుతామని, శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తామని చెప్పారు.
బిల్లుపై ఓటింగు పెట్టాలని, లేదంటే ముఖ్యమంత్రి గానీ తాము గానీ ఇచ్చిన నోటీసును సభ ముందు ఉంచి ఓటింగు పెట్టాలని సీమాంధ్ర తెలుగుదేశం సభ్యులు పట్టుబడుతున్నారు. పరిస్థితిని సదారాం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు వివరించారు.












Click it and Unblock the Notifications