జీవితాంతం జైల్లో ఉంటా, రమ్మంటే వస్తా: బాబుకి మళ్లీ ముద్రగడ షాక్!
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి షాకిచ్చారు. ముద్రగడ శుక్రవారం నాడు ఏపీ డీజీపీ జేవీ రాముడుకు లేఖ రాశారు. కాపు గర్జన సమయంలో జరిగిన తుని విధ్వంసం కేసులో తాము పోలీసులకు సహకరిస్తామని వెల్లడించారు.
తాము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి విచారణకు హాజరవుతామని చెప్పారు. అయితే, అమాయకులను కేసులో ఇరికించే ప్రయత్నాలు చేయవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. అక్రమ కేసులు పెట్టాలనుకుంటే తమను అరెస్టు చేసుకోవచ్చునని చెప్పారు.
Also Read: ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు: నేతలు పార్టీ వీడటంపై రేవంత్‌రెడ్డి ఆవేదన
విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. తాము అందరం ముందస్తు బెయిల్ కోసం కూడా వెళ్లమని చెప్పారు. తమది ఆకలితో చేసిన ఉద్యమమే కానీ ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. ఆకలితో ఉన్న తమ జాతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్సిజన్ లాంటి హామీ ఇచ్చారన్నారు.

చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే తాము డిమాండ్ చేసి రోడ్డు ఎక్కామని చెప్పారు. తాము ఎప్పుడు రమ్మన్నా విచారణకు వచ్చేందుకు సిద్ధమని చెప్పారు. తమ జాతి కోసం జైలుకు వెళ్లేందుకైనా నేను సిద్ధమని ప్రకటించారు. సమావేశానికి వచ్చిన వారిని మాత్రం వేధించవద్దన్నారు.
సమావేశానికి హాజరైన వివరాలు పది రోజుల్లో ఇస్తానని ఆయన చెప్పారు. తన పైన జీవిత కాలం జైల్లో ఉండేలా కేసులు పెట్టుకున్నా అభ్యంతరం లేదని చెప్పారు. బెయిల్ కూడా తీసుకునే ప్రయత్నం నేను చేయనని చెప్పారు. తమ జాతి కోసం మాకు సంకెళ్లు వేసినా అభ్యంతరం లేదన్నారు. తుని ఘటనలో ప్రభుత్వం ఆదేశం మేరకు సీఐడీ విచారణ జరుగుతోంది.












Click it and Unblock the Notifications