ముద్రగడ రాస్తారోకో విరమణ: ప్రభుత్వానికి డెడ్‌లైన్, లేదంటే ఆమరణ దీక్ష
కాకినాడ: కాపులను బీసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం రాత్రి త ఆందోళనను విరమించారు. రేపు (సోమవారం) సాయంత్రం లోగా కాపులను బీసీల్లో చేర్చాలని, లేదంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.
కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తుని వద్ద జాతీయ రహదారిపై చేపట్టిన రాస్తారోకోను ఆదివారం రాత్రి 10గంటల సమయంలో విరమించారు. దీంతో జాతీయ రహదారిపై తునికి ఇరువైపుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆందోళనలో పాల్గొన్న వారు వాహనాల్లో తరలి వెళ్లారు.

ఉద్యమం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, నేతలు అనుసరించిన తీరుపై ముద్రగడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రంలోగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దాదాపు మూడు వేలకు పైగా ప్రత్యేక బలగాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. తునిలో 144 సెక్షన్ విధించారు.
తుని పట్టణంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు. తునిలో రెండు వేల మంది పోలీసులను మోహరించినట్లు ఆయన చెప్పారు. మరోపక్క ఆందోళన విరమించడంతో అధికారులు రైళ్ల రాకపోకలపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా అధికారులు ట్రాక్‌లను పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications