బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
సత్యసాయి: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' పేరుతో రెండో రోజు లేపాక్షి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్యపై మహిళలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా లేపాక్షి మండలంలోని కొండూరు, కల్లూరు, నాయనపల్లి గ్రామాల్లో బాలకృష్ణ పర్యటించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డప్పుకొట్టి ప్రజల్లో ఫుల్ జోష్‌ను నింపారు బాలయ్య. ఆయన అబిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వైసీపీ సర్కారుపై బాలకృష్ణ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ విదేశీ విద్యను జగన్ విదేశీ విద్యగా పేరు మార్చి గాలికి వదిలేశారని బాలయ్య ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి అంబేడ్కర్ విదేశీ విద్యను తీసుకువచ్చి పేద విద్యార్థులకు ఉన్నత చదువులను అందిస్తామని హామి ఇచ్చారు.
అంతేగాక, పేద రైతులకు రెండు ఎకరాల కొనుగోలు భూమిని అందిస్తామనన్నారు బాలయ్య. అధికార పార్టీ హయాంలో రాష్ట్రంలో పరిశ్రమలు రాక యువత పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తాన్నారని విమర్శించారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీగా బీకే పార్థసారథిని గెలిపించాలని ఓటర్లను కోరారు. టీడీపీ అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేలా కార్యాచరణ రూపొందించిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధంతో సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు బాలయ్య పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications