మంగళగిరి ఎన్నికల ప్రచారంలో దుమ్మురేపుతున్న నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రధానపార్టీల ముఖ్య నాయకులతో పాటు, వారి కుటుంబసభ్యులు కూడా ఎన్నికల క్షేత్రంలో ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంటే, టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ కోసం ఆయన సతీమణి బ్రాహ్మణి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.
నారా బ్రాహ్మణి సుడిగాలి పర్యటనలు
మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం 29 సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారని, మంగళగిరి నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించడానికి లోకేష్ తనవంతుగా ఇప్పటికే సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు స్త్రీశక్తి పథకంలోని లబ్ధిదారులతో మాట్లాడిన బ్రాహ్మణి అభివృద్ధి సంక్షేమం కావాలంటే నారా లోకేష్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎక్స్ లో బ్రాహ్మణి పోస్ట్
ఇక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా సంఘాల మహిళలను కలిశానని, నియోజకవర్గ ప్రజల కోసం లోకేష్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పానన్నారు. వాటిలో స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు 32 బ్యాచ్ లుగా 1600 మందికి కుట్టు శిక్షణ ఇచ్చి... కుట్టు మిషన్లు కూడా అందజేశారని పేర్కొన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి స్త్రీశక్తి, మహిళామిత్ర, డ్వాక్రా సంఘాల మహిళలను ఈరోజు కలిసాను. నియోజకవర్గ ప్రజల కోసం లోకేష్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వాటిలో స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళల స్వావలంబనకు చేయూతనిస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 32… pic.twitter.com/7cSYcGy9EZ
— Brahmani Nara (@brahmaninara) April 20, 2024
తన ప్రతి విజయం వెనుక లోకేష్: బ్రాహ్మణి
మహిళల ఆర్థిక అభివృద్ధికి లోకేష్ ఎంతో దోహదం చేస్తారని, తన ప్రతి విజయం వెనుక లోకేష్ ఉన్నారని బ్రాహ్మణి తెలిపారు. అంతకుముందు మల్లె తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలతో బ్రాహ్మణి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారంతా బ్రాహ్మణితో మాట్లాడుతూ లోకేష్ కు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. రాజధాని భూములు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే చంద్రబాబు ముఖం చూసి ఇచ్చామని చెప్పారు.
భర్త కోసం బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గ ప్రచారం
ఇప్పటి వరకు తమకు ఇస్తామని చెప్పిన కౌలు డబ్బులు రావడం లేదని, ఇలా ఎందుకు అని ప్రశ్నించినందుకు తమ రేషన్ కార్డులు తీసివేసారని బ్రాహ్మణికి చెప్పి వారు వాపోయారు. వచ్చే ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారు బ్రాహ్మణికి చెప్పారు. భర్త కోసం బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకొని ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తూ, ఓటర్ల మద్దతును చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications