కెసిఆర్-జగన్‌లను ఇరుకున పెట్టిన లోకేష్, తెలంగాణలో ఒకసారి ఇబ్బంది..!
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్... తమ కుటుంబ ఆస్తులు ప్రకటిస్తూనే ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. తద్వారా వారిని ఆయన ఇరుకున పెట్టారని అంటున్నారు. తమ ఆస్తుల పైన మాట్లాడే వారుకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.
తమ ఆస్తుల గురించి మాట్లాడే వారు ఎవరైనా తాను ప్రకటించిన ఆస్తుల కన్నా ఎక్కువ చూపిస్తే.. వాటిని వారికే రాసిస్తామని సవాల్ చేశారు. ఇదివరకు కూడా అలా చెప్పామని, కానీ ఎవరూ అలా చూపించలేకపోయారని గుర్తు చేశారు.
అదే సమయంలో, మిగతా వాళ్లు కూడా తమ ఆస్తులు ప్రకటించాలని నారా లోకేష్ పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

రాజకీయ నాయకులు తమ ఆస్తులు ప్రకటించాలని తొలుత కోరింది చంద్రబాబేనని, ఎథిక్స్ కమిటీని 1994లో ఏర్పాటు చేశారన్నారు. ఆ తర్వాతనే పార్లమెంటులోనూ ఈ నిబంధన పెట్టారని, ఎన్నికల కమిషన్ ఆస్తులు ప్రకటించాలని ఆదేశించిందన్నారు.
హెరిటేజ్‌లో అన్ని లెక్కల ప్రకారం తాము ఆదాయం పొందామే తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోలేదని పేర్కొన్నారు. తమ తీరును అన్ని పార్టీల నాయకులు ఆదర్శంగా తీసుకుని తమ ఆస్తులను కూడా ప్రకటించాలని సూచించారు.
అలా చేస్తేనే సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు. హెరిటేజ్ వార్షిక నివేదిక 162వ పేజీలో తమ జీతం, కమిషన్ కూడా పేర్కొన్నారని ఎవరైనా చూసుకోవచ్చన్నారు. చంద్రబాబు తన ఆస్తులు ప్రకటించినట్లు కెసిఆర్, జగన్‌లు ప్రకటించగలరా అని టిడిపి తమ్ముళ్లు కూడా ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇబ్బందిపై...
తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా ఇబ్బంది ఉందా అని ఒకరు ప్రశ్నించగా... ఒకసారి ఇబ్బంది పడ్డామని చెప్పారు. శాసనసభలో హెరిటేజ్ పాలకు నాణ్యత లేదన్నారని, దాంతో కొంత ఇబ్బంది పడ్డామని, కానీ నేడు కోలుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రాంతానికి తాము ఏటా 30కోట్లు పన్ను రూపేణా చెల్లిస్తున్నామని, తెలంగాణలోనే అత్యధికంగా 55 స్టోర్లు ఉన్నాయన్నారు. తెలంగాణలో తమకు చాలా వ్యాపారం ఉందన్నారు.












Click it and Unblock the Notifications