Nara Lokesh : నారా లోకేష్ 200 రోజుల పాదయాత్ర- ప్లస్ ఏంటి ? మైనస్ ఏంటి ?
ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 200 రోజుల్లో రాయలసీమ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర దక్షిణ కోస్తా జిల్లాలకు చేరుకుంది. ఈ 200 రోజుల్లో 77 అసెంబ్లీ నియోజకవర్గాల్ని చుట్టేసిన లోకేష్.. తన 4 వేల కిలోమీటర్ల లక్ష్యంవైపు సాగిపోతున్నారు. అయితే ఈ 200 రోజుల యాత్ర రాష్ట్రంలో ప్రజల్ని కదిలించిందా ? దాదాపు సగం రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్రకు వచ్చిన రెస్పాన్స్ ఏంటనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్రంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వీటిలో దాదాపు సగం పూర్తయిన ఈ యాత్ర ఇంతవరకూ ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకోలిగిందన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ లోకేష్ చేసిన పాదయాత్రలో ఎక్కువగా కనిపించిన దృశ్యాలు, ప్రభుత్వం, ప్రజల నుంచి దానికి లభించిన స్పందన ఆధారంగా దీనిపై ఓ ఫీడ్ బ్యాక్ తయారు చేస్తే అందులో కనిపించే అంశాలను ఓసారి చూద్దాం..

లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు సొంత పార్టీ సహా ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కుప్పంలో యాత్ర మొదలుపెట్టినప్పుడు తన కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వారు మాత్రమే కనిపించారు. అలాగే లోకేష్ యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం పలు ఆంక్షలు కూడా పెట్టింది. యాత్రలో లోకేష్ సభలు పెట్టొద్దని కూడా అడ్డుకున్న సందర్భాలున్నాయి. కానీ యాత్ర ముందుకు సాగుతున్న కొద్దీ ఈ ఆంక్షల వలయం చెరిగిపోయింది. ఇప్పుడు ఆంక్షలపై ఎక్కడా చర్చ లేదు. దీనికి కారణం యాత్ర ప్రజల్లో రాబట్టుకున్న స్పందనే.
అలాగే లోకేష్ ఈ యాత్రలో ప్రతీ నియోజకవర్గంలోనూ ప్రధానంగా ఓటర్లుగా ఉన్న సామాజిక వర్గాలు, ఇతర వర్గాల ప్రతినిధుల్ని కలిసేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. దీంతో గతంలో రాష్ట్రంలో సాగిన పాదయాత్రల తరహాలోనే కొత్త సమస్యలు, అలాగే పెండింగ్ సమస్యలు కూడా తెరపైకి వస్తున్నాయి. అలాగే మధ్యలో యాంకర్లతో చేసిన సందడి, అంతా తానే కాకుండా ఇతరులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం, పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారాలు ప్రకటించడం, హామీలు ఇవ్వడం ఆకట్టుకుంది.

అయితే లోకేష్ పాదయాత్ర జనంలోకి ఆశించిన స్ధాయిలో వెళ్లలేదన్న ప్రచారం కూడా ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది లోకేష్ ప్రసంగాల్లో చంద్రబాబు తరహాలో పస లేదనే చర్చ జరుగుతోంది. అలాగే స్ధానిక నాయకత్వంతో పాటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో జనాన్ని కనెక్ట్ అయ్యే ఎమోషన్ కరవవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో లోకేష్ చేస్తున్న విమర్శలు రొటీన్ గా కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి స్పందన బాగానే ఉంటున్నా రెగ్యులర్ జనం నుంచి మరింత స్పందన రాబట్టుకోవాలంటే లోకేష్ రూటు మార్చాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications