జగన్ 420: లోకేష్, బాబు చొక్కా పట్టుకోండి: విజయ
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్ పెద్ద 420 అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్‌కు ఓటు వేసి మోసపోవద్దని ఆయన గురువారం ప్రజలకు పిలుపు ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా భామిని, సీతంపేట, తదితర ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకే ఉందన్నారు. టిడిపి ఇచ్చిన హామీలన్నీ ఆచరణ సాధ్యమేనన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పెట్టే ప్రలోభాలకు ప్రజలు లొంగరాదని కోరారు. సీమాంధ్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీనే గెలిపించాలన్నారు.
తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రధాన ప్రతిపక్షనేతగా ప్రజల కోసం ఏమి చేసావంటూ నారా చంద్రబాబు నాయుడిని చొక్కాపట్టుకుని నిలదీయాలని ప్రజలకు వైయస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండ నియోజకవర్గాల్లో జరిగిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు.

రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాం, జపాన్ చేస్తానంటూ అమలు సాధ్యం కాని హామీలు ఇస్తున్న చంద్రబాబును నమ్మవద్దన్నారు. 25 ఏళ్లు కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇంతవరకు దానిని మున్సిపాలిటీ కూడా చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని నాయకులు రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నింటినీ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్నది రాజన్న రాజ్యమేనన్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పడం, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేయడం జగన్‌కు, తనకు అలవాటు లేదన్నారు.












Click it and Unblock the Notifications