జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌పై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయి. తిరుపతి నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నందమూరి అభిమానులకు కోరికను నారా లోకేష్ బయటపెట్టారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్న నారా లోకేష్
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలని ఎవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు, రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనస్సు అని అన్నారు. అలాంటివారు సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారన్నారు.

పవన్ కళ్యాణ్‌ది మంచి మనసంటూ నారా లోకేష్
మరోవైపు, తన పాదయాత్రలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కూడా గుర్తు చేశారు లోకేష్. రాజకీయాల్లోకి రావాలంటే ముందు మంచి మనసు ఉండాలని.. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌లో ఆ మంచి మనసును చూశానని లోకేష్ తెలిపారు. ఇలాంటివారు రాజకీయాల్లో ఉండాలన్నారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని మండిపడ్డారు.

మంగళగిరిలో చరిత్ర సృష్టిస్తానంటూ నారా లోకేష్
1983, 1985 ఈ రెండుసార్లు మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచిందని.. టీడీపీ గెలవని చోటు గెలిచి, పార్టీకి కంచుకోటగా మార్చాలనుకున్నానని లోకేష్ తెలిపారు. మొదటిసారి ఫెయిలయ్యా.. అయినా తనలో ఫైర్ ఉందని.. 2024లో మంగళగిరిలో గెలిచి చరిత్ర సృష్టిస్తామని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ఈ మూడు కలిసికట్టుగా వెళ్తేనే.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందన్నారు. టీడీపీ హయాంలో 40వేల పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని లోకేష్ చెప్పారు.
32వేల మందికి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని, సులభ రుణాలతో స్వయం ఉపాధి కల్పించామన్నారు. 35 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు.

టీడీపీ అధికారంలో వచ్చాక..: నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, రాజకీయ కక్షతో ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కక్షసాధింపునకు చూపే శ్రద్ధ కొంత అభివృద్ధిపైన చూపితే పరిశ్రమలు వస్తాయన్నారు లోకేష్. తిరుమలలో పింక్ డైమండ్ కొట్టేసినట్టు ఆరోపణలు చేసిన వారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలందరూ ఆరోపణలు చేయటం సులభమని, తాను చిత్తశుద్ధితో పని చేశానని, ఏ నాడు తప్పు చేయలేదని లోకేష్ స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్లను మూసేయటం బాధాకరమని, టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి వంద రోజుల్లోనే అన్న క్యాంటీన్లను తెరుస్తామని, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కాగా, లోకేష్ యువగళం పాదయాత్రతతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications