నా రక్తం ఉడికి పోతోంది..కోపం కట్టలు తెంచుకుంటోంది- లోకేష్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం, విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు.
వందల కోట్ల రూపాయల మేర కుంభకోణంతో ముడిపడి ఉన్న కేసు కావడం వల్ల ప్రధాన నిందితుడు, ఏ1 చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యులు, సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించారు. 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలిస్తూ తీర్పు ఇచ్చారు. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఈ పరిణామాలన్నింటిపై నారా లోకేష్ స్పందించారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ రాశారు. బాధ, బరువెక్కిన హృదయం, కన్నీళ్లతో రాస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం నాన్న తన జీవితాన్ని ధారపోశారని గుర్తు చేశారు. ఆ త్యాగాలను తాను చూస్తూ పెరిగానని పేర్కొన్నారు.
లక్షలాది ప్రజల జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూ వచ్చిన చంద్రబాబుకు విశ్రాంతి అనేదే తెలియదని భావోద్వేగంతో చెప్పారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారని, ఎన్నో ఆటుపోట్లను చూసినప్పటికీ.. ఏ రోజూ చలించలేదని నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారని, తోటి వారి సంతోషమే తన ఆనందంగా చంద్రబాబు భావించారని చెప్పారు.
చంద్రబాబును చూసి స్ఫూర్తి పొందిన లక్షలాదిమందిలో తానూ ఒకడినని, ఆయన అడుగుజాడల్లోనే నడిచానని నారా లోకేష్ అన్నారు. అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రానికి తిరిగి వచ్చానని, అలా రావాలనే నిర్ణయం చాలా కఠినమైనదిగా అనిపించిందని పేర్కొన్నారు.
నేడు చంద్రబాబు తాను చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే, తన కోపం కట్టలు తెంచుకుంటోందని, రక్తం ఉడికిపోతోందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా పగ ప్రతీకారాలను తీర్చుకోవడానికి ఒక హద్దు అనేది ఉంటుందని, జగన్ ప్రభుత్వం ఈ హద్దును దాటిందని పేర్కొన్నారు.

దేశం, రాష్ట్రం, తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన చంద్రబాబు ఈ అన్యాయాన్ని ఎందుకు భరించాలి.. అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ పగ విధ్వంసక రాజకీయాలకు పాల్పడలేదని నారా లోకేష్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన ఆయన ఇప్పుడు జైలుకు వెళ్లారని, ఇదంతా ఓ నమ్మకద్రోహంలా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఓ పోరాట యోధుడని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో తాను ప్రజా పోరాటానికి దిగుతున్నానని, తిరుగులేని శక్తితో మళ్లీ ఎదుగుతామంటూ నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications